
జాబితాలో కెనరా హెచ్‌ఎస్‌బీసీ, పైన్ ల్యాబ్స్
హీరో మోటార్స్, ఎంటీఆర్ ఫుడ్స్, కెనరా రొబెకో
కొద్ది నెలలుగా సెకండరీ మార్కెట్లు ఊగిసలాడుతున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సెబీ తాజాగా 7 కంపెనీలను అనుమతించింది. జాబితాలో కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్,కెనరా రొబెకో, హీరో మోటర్స్ తదితర కంపెనీలున్నాయి. ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటికే 55 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా సుమారు రూ. 75,000 కోట్లు సమీకరించాయి. మరో 12 కంపెనీలు రెండు, మూడు వారాల్లో ఐపీవోకు రానున్నాయి. తాజా వివరాలు చూద్దాం..
దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఇటీవల జోరుగా లిస్టవుతున్న పలు కంపెనీల బాటలో మరో 7 కంపెనీలు ఐపీవో చేపట్టేందుకు దారి ఏర్పడింది. సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిధుల సమీకరణ బాటలో సాగనున్నాయి. ఐపీవోకు అనుమతి పొందిన కంపెనీల జాబితాలో కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, కెనరా రొబెకో ఏఎంసీ, హీరో మోటార్స్‌సహా ఎమ్వీ ఫొటోవోల్టాయిక్ పవర్, పైన్ ల్యాబ్స్, మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్, ఎంటీఆర్ ఫుడ్స్ చేరాయి. ఈ ఏడాది(2025) ఏప్రిల్–జూలై మధ్య ఈ కంపెనీలన్నీ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వెరసి ఈ 7 కంపెనీలు ఉమ్మడిగా రూ. 10,000 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు మర్చంట్ వర్గాలు తెలియజేశాయి. అత్యధిక శాతం కంపెనీలు ఈక్విటీ జారీ నిధులను ప్రధానంగా వ్యాపార విస్తరణ, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నాయి. మరోవైపు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రస్తుత వాటాదారులకు తమ పెట్టుబడులు విక్రయించేందుకు సైతం వీలు కల్పించనున్నాయి.
జీవిత బీమా సంస్థ
పీఎస్‌యూ దిగ్గజం కెనరా బ్యాంక్ బీమా అనుబంధ సంస్థ కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ తాజాగా క్లియరెన్స్ ఇచ్చినట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూలో భాగంగా సంస్థ 23.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో కెనరా బ్యాంక్ 13.77 కోట్ల షేర్లు, ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) 9.5 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఈ బాటలో హెచ్‌ఎస్‌బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ సైతం 47 లక్షల షేర్లు విక్రయించనుంది. కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్‌ను కెనరా బ్యాంక్, పీఎన్‌బీ, హెచ్‌ఎస్‌బీసీ గ్రూప్ ప్రమోట్ చేశాయి. 2024 మార్చికల్లా నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం)రీత్యా మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది.
ఫిన్‌టెక్ కంపెనీ
పీఈ దిగ్గజాలు టెమాసెక్, పీక్ 15 పార్ట్‌నర్స్ తదితరాలకు పెట్టుబడులున్న ఫిన్‌టెక్ కంపెనీ పైన్ ల్యాబ్స్ ఐపీవోలో భాగంగా రూ. 2,600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారులు మరో 14.78 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. లోక్‌వీర్ కపూర్‌సహా.. టెమాసెక్, పీక్ 15 పార్ట్‌నర్స్, యాక్టిస్ తదితర సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 870 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 760 కోట్లు క్లౌడ్, డిజిటల్ చెక్‌ఔట్ పాయింట్లు తదితర ఐటీ మౌలికసదుపాయాలపై వెచి్చంచనుంది.
రూ. 1,200 కోట్లపై కన్ను
పబ్లిక్ ఇష్యూలో భాగంగా హీరో మోటార్స్ రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,200 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ప్రమోటర్ సంస్థలలో ఓపీ ముంజాల్ హోల్డింగ్స్ రూ. 390 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 285 కోట్లు రుణ చెల్లింపులకు, యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్‌లోగల యూనిట్ విస్తరణకు రూ. 237 కోట్లు(పరికరాల కొనుగోలుకి) వెచి్చంచనుంది.
అసెట్ మేనేజ్‌మెంట్
ఐపీవోలో భాగంగా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఏఎంసీ).. కెనరా రొబెకో ఏఎంసీ 4.98 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని సంస్థ ప్రమోటర్లు కెనరా బ్యాంక్(2.59 కోట్ల షేర్లు), ఓరిక్స్ కార్పొరేషన్ యూరోప్ ఎన్‌వీ(2.39 కోట్ల షేర్లు) ఆఫర్ చేయనున్నాయి. వెరసి ఐపీవో నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్లకు చేరనున్నాయి.
సోలార్ పరికరాలు
ఐపీవో ద్వారా సోలార్ పరికరాల తయారీ కంపెనీ ఎమ్వీ ఫొటొవోల్టాయిక్ పవర్ రూ. 3,000 కోట్లు అందుకోవాలని ప్రణాళికలు వేసింది. వీటిలో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 2,144 కోట్లు, ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా మరో రూ. 856 కోట్లు చొప్పున సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,608 కోట్లు అనుబంధ సంస్థలతోపాటు కంపెనీ రుణ చెల్లింపులకు వినియోగించనుంది.
ఒర్‌క్లా ఇండియా
ఎంటీఆర్ ఫుడ్స్, ఈస్టర్న్ బ్రాండ్లతో సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు విక్రయించే ఒర్‌క్లా ఇండియా(మాతృ సంస్థ) ఐపీవో ద్వారా 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని కంపెనీ ప్రమోటర్లతోపాటు.. ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు.
మణిపాల్ పేమెంట్
బ్యాంకింగ్ సేవలు, స్మార్ట్ కార్ట్ తయారీ కంపెనీ మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది.
ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా?