Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది..

Ameera Shah md metropolis healthcare success story inspiring daughter - Sakshi

ఆయనొక పాథాలజిస్ట్‌.. ముంబైలో చిన్న ల్యాబ్‌ను నడిపేవాడు.. విదేశాల నుంచి అతని కూతురొచ్చింది. ఆ చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల మల్టీ చెయిన్‌ సంస్థగా తీర్చిదిద్దింది.  ఆమె ఎవరు.. తండ్రి కలను ఎలా సాకారం చేసింది.. తెలుసుకోండి..

అమీరా షా.. మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా అనేక డయాగ్నస్టిక్ సెంటర్‌లు ఉన్నాయి. విదేశాల్లో చదివిన అమీరా షా ఫైనాన్స్ ప్రొఫెషనల్. గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌లో పని చేసేది. అందులో సంతృప్తి లేక వ్యాపారవేత్తగా మారాలని నిర్ణయించుకుంది. తన వ్యాపార పరిజ్ఞానాన్ని తండ్రి వైద్య ప్రావీణ్యంతో మిళితం చేసి, రూ. 6478 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న అతిపెద్ద డయాగ్నస్టిక్ సంస్థను సృష్టించింది.

వైద్య కుటుంబం
అమీరా షా ముంబైలోని హెచ్‌ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఆమె యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్ నుంచి ఫైనాన్స్ డిగ్రీ అందుకున్నారు.  ఆమె వైద్యుల కుటుంబానికి చెందిన వారు. తండ్రి పాథాలజిస్ట్ డాక్టర్ సుశీల్ షా. తల్లి  గైనకాలజిస్ట్ డాక్టర్ దురు షా. సోదరి జన్యు శాస్త్రవేత్త.  కంపెనీని విజయవంతంగా ప్రారంభించిన అనంతరం కూడా ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఓనర్-ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ చేశారు. 

21 ఏళ్లకే స్టార్టప్‌
అమీరా షా ఒక పాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  తాను గోల్డ్‌మన్ సాక్స్‌లో పనిచేస్తున్నప్పటికీ ఆ ఉద్యోగం తనకు సంతృప్తిని ఇవ్వలేదని, అంత పెద్ద ఆర్థిక సేవల సంస్థలో పనిచేస్తున్నా  ఆ  ఉద్యోగాన్ని ఎప్పుడూ ఆస్వాదించలేదని చెప్పారు. దీంతో ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కేవలం ఐదుగురు వ్యక్తులతో స్టార్టప్‌ ఏర్పాటు చేశారు. అప్పుడు ఆమె వయసు కేవలం 21 ఏళ్లు. ఇలా లాభం లేదు ఇంకా మరింత ప్రభావం చూపాలన్న తండ్రి సలహా మేరకు ఆమె భారత్‌కు తిరిగివచ్చారు.

అలా దేశానికి తిరిగిన వచ్చిన ఆమె తన తండ్రి నడుపుతున్న ల్యాబ్‌లో సమస్యలను గుర్తించింది. ఆ లాబ్‌ చాలా సాదాసీదాగా ఉంది. కంప్యూటర్లు కూడా లేవు. కానీ తన ల్యాబ్‌ను అతిపెద్ద డయాగ్నోస్టిక్స్ చైన్‌ను రూపొందించాలన్నది ఆయన కల. కానీ ఎలాగో తనకు తెలియదు. తండ్రి కలను సాకారం చేసే భారీ ఆపరేషన్‌ను మొదలు పెట్టింది అమీషా. 

మొదటగా ల్యాబ్‌ను ఆధునికీకరించి అన్ని వసతులు, హంగులతో తీర్చిదిద్దింది. ల్యాబ్‌లో పేషంట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించింది. వివిధ విభాగాలను సృష్టించి ల్యాబ్ నిర్వహణను మెరుగ్గా మార్చేసింది. తండ్రి సహకారంతో ఆ కంపెనీకి సీఈఓ అయింది. 

ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు..

కిందిస్థాయి నుంచి..

ఆమె ఈ సంస్థను కింది స్థాయి నుంచి ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఆమే స్వయంగా కస్టమర్ కేర్ కౌంటర్‌లో రోగులకు సేవలందించింది. రోజువారీ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం  ప్రారంభించింది. ల్యాబ్‌ పేరును డాక్టర్ సుశీల్ షా లాబొరేటరీ నుంచి మెట్రోపాలిస్‌గా మార్చారు. తర్వాత ఇతర డయాగ్నోస్టిక్‌ సెంటర్లతో భాగస్వామ్యం చేయడం ప్రారంభించారు. వారి మొదటి టై అప్ చెన్నైలో  డాక్టర్ శ్రీనివాసన్ అనే పాథాలజిస్ట్‌తో జరిగింది.

అనతి కాలంలోనే వారి డయాగ్నోస్టిక్‌ సంస్థ అభివృద్ధి బాట పట్టింది. 2006 సంవత్సరంలో  వారికి బయటి నుంచి నిధులు వచ్చాయి. వ్యాపారంలో సంపాదించిన డబ్బును అలాగే పెట్టుబడి పెట్టారు. 2002లో వారికి ఒకే ఒక ల్యాబ్ ఉండేది. దీని ఆదాయం అప్పట్లో రూ.7 కోట్లు. 2023లో వారి ఆదాయం రూ.1148 కోట్లు. మార్చి త్రైమాసికంలోనే వారి నికర లాభం రూ.33 కోట్లు. నేడు వారి మెట్రోపాలిస్‌ సంస్థకు  1500 పైగా సేకరణ కేంద్రాలు, 125 పైగా ల్యాబ్‌లు ఉన్నాయి. ఇవి ఏడు దేశాల్లో పనిచేస్తున్నాయి.

ఇలాంటి స్పూర్తివంతమైన పారిశ్రామిక వేత్తల విజయగాథలు, ఆసక్తికరమైన కథనాల కోసం సాక్షి బిజినెస్‌ పేజీని చూడిండి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top