ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో కింది స్థాయి ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. అమెజాన్ వేతనాలను గంటకు 15 డాలర్లకు పెంచిన ఐదు సంవత్సరాల తర్వాత, పరిశోధకులు చేసిన సర్వేలో సగం మంది వేర్‌హౌస్ వర్కర్లు తాము తిండికి, వసతికి కూడా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
అమెరికాలో అమెజాన్ ఉద్యోగులు పరిస్థితి మెరుగుపడిందా.. తిండి తింటున్నారా, ఆకలితో ఉంటున్నారా.. అద్దె, ఇతర చెల్లింపులు చేయగలుగుతున్నారా వంటి అంశాలతో వారి ఆర్థిక శ్రేయస్సుపై యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో అర్బన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ సెంటర్ తాజాగా చేసిన జాతీయ అధ్యయనాన్ని ప్రచురించింది. ఇందులో 53 శాతం మంది తాము గడిచిన మూడు నెలల్లో తిండికి కూడా కష్టాలు పడినట్లు నివేదించారు. ఇంటి అద్దెలు, ఇతర చెల్లింపులకు అవస్థలు పడినట్లు 48 శాతం మంది పేర్కొన్నారు.
సియాటిల్‌కు చెందిన వాల్‌మార్ట్ తర్వాత అమెరికాలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ అమెజాన్. యూఎస్ వేర్‌హౌసింగ్ పరిశ్రమ వర్క్‌ఫోర్స్‌లో అమెజాన్ 29 శాతం వాటాను కలిగి ఉందని పరిశోధకుల అంచనా. అమెజాన్ వేర్‌హౌస్‌లలో పనిచేసే ఉద్యోగులను సోషల్ మీడియా ప్రకటనల ద్వారా 98 ప్రశ్నలతో కూడిన ఆన్‌లైన్ సర్వే చేసింది అధ్యయన బృందం. యూఎస్ వ్యాప్తంగా 42 రాష్ట్రాల్లోని మొత్తం 1,484 మంది కార్మికుల నుంచి స్పందనలను క్రోడీకరించి నివేదికను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment