ఈ రోజుల్లో కార్పొరేట్ జాబ్ అంటే.. నీటిమీద బుడగ వంటిదనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందే.. ఎవరికీ తెలియదు. ఇలాంటి అనుభవమే అమెజాన్ ఉద్యోగికి ఎదురైంది. ఉద్యోగం కోల్పోవడం.. బాధగా అనిపించినా, తరువాత ఏం జరిగిందనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి..
17 సంవత్సరాలు.. అలుపెరగకుండా పనిచేశాను. కానీ సంస్థ నన్ను ఉద్యోగంలో నుంచి తీసేసింది. లేఆఫ్ ఈమెయిల్ అందిన వెంటనే చాలా బాధపడ్డాను. ఒక గంట తరువాత.. మనసును కుదుటపరచుకున్నాను. నా భార్యకు టిఫిన్ చేయడంలో సహాయం చేసాను. నా పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లాను. వారి నవ్వులు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి. ఆ నవ్వులను ఇన్ని రోజులు మిస్సయ్యానని బాధపడ్డాను. బహుశా జీవించడం అంటే ఇదేనా? అనిపించిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.
ఉద్యోగం చేస్తూ.. జీవితంలో చాలా ఆనందాలను కోల్పోయాను. పిల్లలతో సరైన సమయం గడపలేకపోయాను. కుటుంబంలో జరిగే విందులకు కూడా దూరంగా ఉన్నాను. నేను ఎప్పుడూ విరామం తీసుకోలేదు. నేను చేస్తున్నదంతా (చేస్తున్న ఉద్యోగం) కుటుంబం కోసమే అని నన్ను నేను ఒప్పించుకున్నాను. కానీ 17 ఏళ్లు పనికి.. లేఆఫ్ బహుమతిగా వచ్చింది.
ఉద్యోగం పోయిందనే విషయాన్ని.. నా భార్యతో కాఫీ తాగుతూ చెప్పాను. ఆమె ఏ మాత్రం బాధపడకుండా నాకు మద్దతుగా నిలిచింది. నేను నేనున్నా అంటూ ధైర్యం చెప్పింది. ఆమె మాటలకు నాకు ఆనందబాష్పాలు రాలాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మీరు చేసే పనిని ప్రేమించండి, కంపెనీని కాదు. నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. ప్రతి రోజు కొత్త విషయాన్ని నేర్చుకోండి, అప్పుడు అంతా బాగానే ఉంటుందని ఒక యూజర్ పేర్కొన్నారు. 17 ఏళ్లు కుటుంబం కోసం కష్టపడుతూ కోల్పోయిన ఆనందాన్ని.. తిరిగి కనుగొన్నావని మరొక యూజర్ పేర్కొన్నారు. ఉద్యోగాలు తాత్కాలికమేనని, కానీ చిరునవ్వులు అమూల్యమైనవని ఇంకొకరు అన్నారు.
17 years of nonstop work. No breaks. No slow days. All for the family.
Then, one email. Laid off.
He cried, cooked breakfast with his wife, took his kids to school for the first time, and saw their smiles.
Maybe this is what living means, not the job, but the moments we forget… pic.twitter.com/4F1Pek00j5— Venkatesh Alla (@venkat_fin9) November 3, 2025


