
ఇన్నాళ్లు బంగారం ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందిన ప్రజలకు వెండి కూడా నిరాశ కలిగిస్తోంది. 2025 అక్టోబర్ ప్రారంభంలో రూ. 161000 వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజు (అక్టోబర్ 10) రూ. 1,80,000 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే 10 రోజుల్లో వెండి ధరలు ఎంతగా పెరిగాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
అక్టోబర్ 7 (గురువారం) వెండి రేటు ఏకంగా రూ. 7,000 పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది. ఈ రోజు (శుక్రవారం) కూడా సిల్వర్ రేటు రూ. 3000 పెరిగింది. దీంతో ఒక గ్రామ్ సిల్వర్ రేటు 180 రూపాయలకు చేరింది. వెండి ధరలు ఒక్క భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. అంతర్జాతీయ కూడా గణనీయంగా పెరుగుతోంది.
వెండి రేటు గ్లోబల్ మార్కెట్లో.. మొదటిసారి ఔన్స్‌కు 50 డాలర్ల స్థాయికి చేరి, 2012 నాటి గరిష్టాన్ని చెరిపేసింది. 2012లో ఔన్స్ వెండి ధర 49.50 డాలర్లకు చేరుకుని, తర్వాత గణనీయంగా దిద్దుబాటుకు గురైంది. ఇన్నాళ్ల తర్వాత తిరిగి వెండి లోహానికి బలమైన డిమాండ్ కనిపిస్తోంది.
ఇదీ చదవండి: ఒక్కసారిగా తగ్గిన గోల్డ్ రేటు
పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ మాత్రమే కాకుండా.. అమెరికా టారిఫ్స్ కూడా వెండి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణుల అభిప్రాయం. ప్రముఖ అనలిస్ట్ రాబర్ట్ కియోసాకి కూడా వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ధరలు పెరగడానికి ముందే.. సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేయండి అని సలహా ఇస్తున్నారు.