
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎంఆర్ ఏరో టెక్నిక్ వెల్లడించింది. దీని కింద ఆకాశ ఎయిర్‌కి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు తమ అధునాతన ఎంఆర్‌వో కేంద్రంలో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్) మెయింటెనెన్స్ సేవలు అందించనున్నట్లు వివరించింది.
ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. తమ సాంకేతిక నైపుణ్యాలు, నిర్వహణ సామర్థ్యాలపై విమానయాన సంస్థలకు గల నమ్మకానికి ఈ డీల్ నిదర్శనమని జీఎంఆర్ ఏరో టెక్నిక్ ప్రెసిడెంట్ అశోక్ గోపీనాథ్ తెలిపారు. దేశీయంగా ఎంఆర్‌వో వ్యవస్థ అభివృద్ధి చెందడంలో మద్దతిచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆకాశ ఎయిర్ సహ–వ్యవస్థాపకుడు బెల్సన్ కొటిన్హో పేర్కొన్నారు.