పశ్చిమాసియా ప్రభావంతో పెరుగుతున్న ఇంధన ధరల భారం నుంచి ఎయిర్‌లైన్స్‌కి ఊరట కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ధరల స్థిరీకరణ పథకానికి ఆదరణ కరువైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దీన్ని ఉపయోగించుకోవడంపై విమానయాన సంస్థలేవీ ఆసక్తి చూపలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకి వెళ్తే .. ప్రభుత్వం రూ. 10,000 కోట్లతో జెట్ ఫ్యూయల్ రేట్ల స్థిరీకరణ పథకాన్ని ప్రకటించింది. ఎయిర్‌లైన్స్ ఇందులో స్వచ్ఛందంగా చేరొచ్చు. దీని ప్రకారం మూడేళ్ల పాటు పన్నులు మొదలైనవన్నీ కలిపి లీటరుకు రూ. 115 రేటు (ఢిల్లీ ధర) చొప్పున చెల్లించి కొనుక్కునేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది.
సబ్సిడీపై విక్రయించడం వల్ల ఆయిల్ కంపెనీలకు నష్టాలేవైనా వాటిల్లితే ప్రభుత్వం దాన్ని భర్తీ చేస్తుంది. ఈ స్కీములో చేరని కంపెనీలు మార్కెట్ ధరలను చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది. పథకాన్ని ప్రకటించిన జూన్ 3 నాడు రేట్లు సుమారు రూ. 142 స్థాయిలో ఉండగా రూ. 115 రేటును ప్రతిపాదించారు. కానీ ప్రస్తుతం ఆ రెండింటి కన్నా ఏటీఎఫ్ ధర గణనీయంగా తగ్గి రూ. 110 స్థాయికి తగ్గింది.
రూ. 38 వేల కోట్లకు ఎయిర్‌లైన్స్ నష్టాలు
నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడం, డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోవడం తదితర అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానయాన సంస్థల పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. 2026–27లో ఎయిర్‌లైన్స్ నష్టాలు ఏకంగా రూ. 36,000–38,000 కోట్లకు పెరగనున్నాయి. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. వాస్తవానికి 2027 ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ. 11,000–12,000 కోట్లకు తగ్గుతాయని ముందుగా అంచనా వేసినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయినట్లు వివరించింది.


