అదానీ చేతికి ఓరియంట్‌ సిమెంట్‌ | Adani Ambuja Cements acquires Orient Cement for Rs 8100 crore from CK Birla group | Sakshi
Sakshi News home page

అదానీ చేతికి ఓరియంట్‌ సిమెంట్‌

Oct 23 2024 3:57 AM | Updated on Oct 23 2024 7:58 AM

Adani Ambuja Cements acquires Orient Cement for Rs 8100 crore from CK Birla group

రూ. 8,100 కోట్ల డీల్‌

46.8 శాతం వాటా కొనుగోలు

అదనంగా 26 శాతం వాటాకు ఓపెన్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ: సిమెంట్‌ పరిశ్రమలో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా అదానీ గ్రూప్‌ కొనుగోళ్ల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా సీకే బిర్లా గ్రూప్‌లో భాగమైన ఓరియంట్‌ సిమెంట్‌ (ఓసీఎల్‌) కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది.  డీల్‌ విలువ సుమారు రూ. 8,100 కోట్లుగా ఉండనుంది. కంపెనీ ప్రకటన ప్రకారం అదానీ గ్రూప్‌లో భాగమైన అంబుజా సిమెంట్స్‌ సంస్థ... ఓరియంట్‌ సిమెంట్‌లో 46.8 శాతం వాటాలను చైర్మన్‌ సీకే బిర్లాతో పాటు నిర్దిష్ట పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల నుంచి రూ.3,791 కోట్లకు కొనుగోలు చేయనుంది.

దీంతో మరో 26 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వాల్సి ఉంది. ఒక్కో ఓసీఎల్‌ షేరుకు రూ. 395.40 రేటు చొప్పున చెల్లించనున్నట్లు, ఈ కొనుగోలుతో తమ మార్కెట్‌ వాటా రెండు శాతం మేర పెరగనున్నట్లు అంబుజా సిమెంట్స్‌ తెలిపింది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ‘ఓసీఎల్‌ కొనుగోలుతో అంబుజా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తుంది. కీలక మార్కెట్లలో విస్తరించడానికి, మార్కెట్‌ వాటాను 2% మేర పెంచుకోవడానికి ఈ డీల్‌ తోడ్పడుతుంది‘ అని అంబుజా సిమెంట్స్‌ డైరెక్టర్‌ కరణ్‌ అదానీ తెలిపారు. టెక్నాలజీ, సరీ్వస్‌ ఆధారిత వ్యాపారాలపై మరింత ఇన్వెస్ట్‌ చేసే క్రమంలో విక్రయ నిర్ణయం తీసుకున్నట్లు ఓరియంట్‌ సిమెంట్‌ చైర్మన్‌ సీకే బిర్లా తెలిపారు.

అదనంగా మరో 8.5 మిలియన్‌ టన్నుల సామర్థ్యం .. 
ఓరియంట్‌ సిమెంట్‌కు పశ్చిమంలో ఒకటి, దక్షిణాదిలో ఒకటి చొప్పున మొత్తం 2 సిమెంట్‌ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ఉత్పత్తి సామర్థ్యం 8.5 మిలియన్‌ టన్నులు. అలాగే, మరో 8.1 మిలియన్‌ టన్నుల ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి.  రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో అత్యంత నాణ్యమైన సున్నపు రాయి గని ఈ సంస్థ సొంతం. ఓసీఎల్‌ కొనుగోలుతో అంబుజా సామర్థ్యం 97.4 మిలియన్‌ టన్నులకు పెరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement