కొత్త ఏడాదిలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. ఏ రంగంలో ఎక్కువంటే?

77 Percent Service Sector Firms Keen On Hiring New Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సరంలో కొత్త కొలువులు పలకరించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు పెరుగుతున్నా భారత్‌లో మాత్రం వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్టు టీమ్‌లీజ్‌ సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా సేవల రంగం (సర్వీస్‌ సెక్టార్‌)లో జనవరి–మార్చి మధ్య కొత్తగా ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు లభిస్తాయని.. దేశంలోని 79 శాతం సంస్థలు కొత్తవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు టీమ్‌లీజ్‌ సంస్థ తమ ‘ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ రిపోర్ట్‌’ను తాజాగా విడుదల చేసింది.

దేశంలోని 14 నగరాలు, 14 సేవారంగాలకు చెందిన 573 చిన్న, మధ్యతరహా, పెద్ద కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు పేర్కొంది. పెద్ద నగరాల్లో.. కొత్తవారికి, ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులకు అవకాశాల కల్పనలో పెద్ద నగరాలు ముందువరసలో ఉన్నట్టు టీమ్‌లీజ్‌ సంస్థ తమ నివేదికలో పేర్కొంది. టెలికం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాల విషయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై మెట్రోసిటీలు అగ్రభాగాన నిలుస్తున్నట్టు తెలిపింది.

సేవల రంగంలో ముఖ్యంగా ఈ–కామర్స్‌ (98 శాతం), టెలీకమ్యూనికేషన్స్‌ (94 శాతం), ఎడ్యుకేషనల్‌ (93 శాతం), ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (88 శాతం), రిటైల్‌ (85 శాతం), లాజిస్టిక్స్‌ కంపెనీల్లో (81 «శాతం) స్థిరమైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నట్టు అంచనా వేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సర్వీసెస్‌ సెక్టార్‌లో భారత్‌ ‘గ్లోబల్‌ లీడర్‌’గా ఉద్భవించే దిశలో సాగుతోందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మయూర్‌ టాడే పేర్కొన్నారు.

‘‘దేశంలోని పలు నగరాల్లో 5జీ టెలికం సర్వీసులు మొదలయ్యాయి. దానికి తగ్గట్టుగానే పరిశ్రమలు, సంస్థలు ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరుస్తూ అప్‌ స్కిల్లింగ్‌ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా ఎడ్యుకేషనల్, ఫైనాన్షియల్, ఔట్‌సోర్సింగ్‌ సర్వీసులపై సానుకూల ప్రభావానికి కారణమయ్యాయి’’అని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజోయ్‌ థామస్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top