
విదేశీ బ్రాండ్లను భారత రిటైల్ మార్కెట్ ఊరిస్తోంది. 2024లో దాదాపు 27 కొత్త విదేశీ రిటైల్ బ్రాండ్స్ దేశీయ విపణిలోకి ఎంట్రీ ఇచ్చాయి. విలాసవంత వస్తువుల కోసం పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి ఇవి భారత్‌లో రంగ ప్రవేశం చేస్తున్నాయని రియల్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ తెలిపింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే భారత్‌లో అడుగుపెట్టిన బ్రాండ్ల సంఖ్య 2024లో రెట్టింపు అయిందని వెల్లడించింది.
పట్టణీకరణ, ఖర్చు చేయదగ్గ ఆదాయం పెరగడం, షాపింగ్ ప్రాధాన్యతల్లో మార్పు లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతోందని వివరించింది. భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా చురుకైన రిటైల్ మార్కెట్‌లలో ఒకటిగా మార్చిందని తెలిపింది. 2023లో 14 బ్రాండ్స్ ఇక్కడి మార్కెట్లో ప్రవేశించాయి. నాలుగేళ్లలో 60 విదేశీ బ్రాండ్స్ భారత్‌కు వచ్చాయి.
దృష్టిని ఆకర్షించింది..
2024లో దేశీయ రిటైల్ రంగంలో బ్యూటీ, సౌందర్య సాధనాలు, ఆరోగ్య సంరక్షణ; పాదరక్షలు, బ్యాగ్స్, యాక్సెసరీస్; ఫ్యాషన్, దుస్తుల విభాగాలు టాప్–3లో నిలిచాయి. ‘భారత రిటైల్ రంగం అంతర్జాతీయ కంపెనీల దృష్టిని ఆకర్షించింది. నాలుగేళ్లుగా ఇక్కడి విపణిలో ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నాలను క్రమంగా పెంచాయి.
గత సంవత్సరం ప్రవేశించిన కంపెనీల్లో 56 శాతం యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా ప్రాంతానికి చెందినవి. ఫ్రెంచ్, ఇటాలియన్ సంస్థలు సైతం వీటిలో ఉన్నాయి. గత ఏడాది దేశంలో ఈ బ్రాండ్స్ సుమారు 1,90,000 చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నాయి. ఇందులో సగం వాటా ఫ్యాషన్, అపారెల్ బ్రాండ్స్ కైవసం చేసుకున్నాయి’ అని జేఎల్‌ఎల్ ప్రతినిధి రాహుల్ అరోరా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment