క్యూ1 ఫలితాలే దిక్సూచి | 10 things that will decide stock market action on Monday | Sakshi
Sakshi News home page

క్యూ1 ఫలితాలే దిక్సూచి

Jul 14 2025 4:44 AM | Updated on Jul 14 2025 4:44 AM

10 things that will decide stock market action on Monday

జాబితాలో టెక్‌ దిగ్గజాలు హెచ్‌సీఎల్‌ టెక్, విప్రో 

టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 

టోకు, రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకం 

యూఎస్‌తో వాణిజ్య ఒప్పందాలకూ ప్రాధాన్యత

దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం అటు ఏప్రిల్‌–జూన్‌

(క్యూ1) ఫలితాలతోపాటు.. ఇటు ఆర్థిక గణాంకాల ఆధారంగా కదిలే వీలుంది. ఈ వారం పలు టెక్‌ దిగ్గజాల క్యూ1 పనితీరు వెల్లడికానుండగా.. టోకు, రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. వీటికితోడు అంతర్జాతీయ అంశాలు, మార్కెట్లపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం... 

గత వారం చివర్లో డీలా పడిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం కన్సాలిడేషన్‌ బాటలో సాగే అవకాశమున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్‌ ప్రారంభంకావడంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి పెట్టనున్నట్లు ఆల్మండ్‌ గ్లోబల్‌ సీనియర్‌ ఈక్విటీ రీసెర్చ్‌ నిపుణులు సిమ్రన్‌జీత్‌ సింగ్‌ భాటియా తెలియజేశారు. గత వారం ఐటీ సేవల టాటా గ్రూప్‌ దిగ్గజం టీసీఎస్‌ క్యూ1 పనితీరుతో సీజన్‌కు తెరతీసింది.

 ఫలితాలు, అంచనాలు నిరాశపరచడంతో వారాంతాన టీసీఎస్‌సహా ఇతర ఐటీ కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఈ వారం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, టెక్‌ మహీంద్రా, విప్రోతోపాటు.. ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్, మెటల్‌ రంగ బ్లూచిప్‌ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ తదితరాలు క్యూ1 ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో మార్కెట్‌ ఆటుపోట్ల మధ్య ఫలితాల ఆధారంగా కొన్ని కౌంటర్లు వెలుగులో నిలవవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు.  

ధరల గణాంకాలు.. 
గత(జూన్‌) నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు(14న) విడుదలకానున్నాయి. మే నెలకు డబ్ల్యూపీఐ 0.39 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో నమోదైన 0.85 శాతంతో పోలిస్తే తగ్గింది. ఈ బాటలో జూన్‌ నెలకు రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను ప్రభుత్వం 15న ప్రకటించనుంది. మే నెలలో సీపీఐ 2019 ఫిబ్రవరి తదుపరి కనిష్టంగా 2.82 శాతానికి చేరింది. 

ఏప్రిల్‌లో నమోదైన 3.16 శాతంతో పోలిస్తే వెనకడుగు వేసింది. ధరల గణాంకాలు రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టే పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల నిర్ణయాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. దీంతో వీటికి ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్‌ నిపుణులు తెలియజేశారు. దేశీయంగా క్యూ1 ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపనుండగా.. ధరల గణాంకాలు సైతం సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు. 

ట్రేడ్‌ డీల్‌పై దృష్టి 
యూఎస్, భారత్‌ మధ్య ఇటీవల ప్రారంభమైన వాణిజ్య టారిఫ్‌ల చర్చలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ కెనడా తదితర పలు దేశాల దిగుమతులపై వివిధ స్థాయిల్లో టారిఫ్‌లను విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్, భారత్‌ వాణిజ్య ఒప్పందంతోపాటు.. ఇతర దేశాలతో ట్రంప్‌ టారిఫ్‌ చర్చలకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. 

విదేశీ అంశాలు 
యూఎస్‌సహా ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల కదలికలు, ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడులు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ వారం యూఎస్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు, చైనా జీడీపీ వివరాలు వెల్లడికానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య టారిఫ్‌ల అనిశి్చతులకుతోడు.. రాజకీయ, భౌగోళిక వివాదాలు కొనసాగుతుండటం సెంటిమెంటును దెబ్బతీయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. వెరసి మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగవచ్చని అభిప్రాయపడ్డారు.

సాంకేతికంగా చూస్తే..
గత వారం ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ కీలకమైన ఇంటర్మీడియెట్‌ మద్దతులను కోల్పాయాయి. నిజానికి మొదటి మూడు రోజులు స్థిరంగా కదిలినప్పటికీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఫలితాలు, టారిఫ్‌లపై అనిశి్చతి, ఎఫ్‌పీఐల అమ్మకాలు దెబ్బతీసినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు.

 ఇంతక్రితం అంచనా వేసినట్లు నిఫ్టీ బ్రేకవుట్‌ సాధించి 25,500కు చేరినప్పటికీ ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. వారాంతాన 25,150కు క్షీణించింది. దీంతో స్వల్ప కాలంలో 24,800–24,700కు నీరసించే వీలుంది. వెరసి 25,400–25,500 వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చు. ఇదేవిధంగా సెన్సెక్స్‌ 82,500కు జారింది. దీంతో 81,500–81,000 స్థాయిలో సపోర్ట్‌ తీసుకునే అవకాశముంది. 82,800–83,050 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్‌ కనిపించవచ్చునని నిపుణలు విశ్లేíÙంచారు.

గత వారమిలా.. 
గత వారం(7–11) దేశీ స్టాక్‌ మార్కెట్లు తొలి అర్ధభాగంలో బలపడినప్పటికీ చివర్లో డీలా పడ్డాయి. వాణిజ్య టారిఫ్‌ వివాదాలు, నిరుత్సాహకర టీసీఎస్‌ ఫలితాలు ప్రభావం చూపాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నికరంగా 932 పాయింట్లు(1.1 శాతం) క్షీణించింది. 82,500 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ సైతం 311 పాయింట్లు(1.2 శాతం) నీరసించింది. 25,150 వద్ద స్థిరపడింది.    

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement