
ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్' (FASTag Annual Pass) ప్రారంభమైంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది.
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. యాన్యువల్ పాస్‌కు జాతీయ రహదారి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆగస్టు 15న అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. అంతే కాకుండా టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి.
జాతీయ రహదారి వినియోగదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే.. ఈ ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్‌లకు (ఏది ముందు అయితే అది) అనుమతిస్తుంది. దీనికోసం రూ. 3000 వన్ టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా లేదా ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లిస్తే.. రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.