ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లిలో నాలుగు లేన్ల రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత అభివృద్ధి చేసిన నాయుడుపేట జంక్షన్‌ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 5గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌లోని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మంత్రి పాల్గొంటారు.
నేడు, రేపు మంత్రి తుమ్మల..
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆది, సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం వేంసూరు మండలం మర్లపాడు, కందుకూరు, దుద్దేపూడి గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. మధ్యాహ్నం 3గంటలకు అశ్వాపురం మండలంలో దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంచే పనులను పరిశీలించనున్నారు.
ఘనంగా
రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం స్వామివారి నిత్యకల్యాణం కమనీయంగా జరి గింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న శ్రీరామా సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి, , అమ్మవార్లకు కంకణధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
వచ్చే నెల 20న
దాతలకు సత్కారం
భద్రాచలంటౌన్: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి రూ.లక్షకు పైగా విరాళాలు అందించిన దాతలను నవంబర్ 20న సత్కరించనున్నట్లు ఈఓ కె.దామోదర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దాతలకు వసతి, భోజన సదుపాయాలతోపాటు కండువా, జాకెట్ పీస్, స్వామివారి ఫొటో, రెండు లడ్డూలతో కూడిన ప్రసాదం కిట్ అందజేస్తామని పేర్కొన్నారు.
ఫుట్‌బాల్ పోటీలు
ప్రారంభం
ఇల్లెందు: పట్టణంలోని 24 ఏరియా సింగరేణి రన్స్ అండ్ గోల్స్ స్టేడియంలో రీజినల్ లెవల్ ఫుట్‌బాల్ పోటీలను ఏరియా జీఎం వీసం కృష్ణయ్య శనివారం ప్రారంభించారు. మణుగూ రు, ఇల్లెందు ఏరియాల క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు. అధికారులు అజ్మీర తుకా రాం, సుధాకర్, అశోక్, కిషోర్, బాబూరావు, రిఫరీలు సూర్యప్రకాష్, చందూ పాల్గొన్నారు.
ఎస్‌ఐల బదిలీలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఆరుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ శనివారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అశ్వాపురం ఎస్‌ఐ ఎల్లా రాజేష్‌ను భద్రాచలానికి, వీఆర్‌లో ఉన్న పిండి శివరామకృష్ణను అశ్వాపురం, భద్రాచలం ట్రాఫిక్‌లో పనిచేస్తున్న పండగ తిరుపతిరావును కొత్తగూడెం వన్‌టౌన్‌కు బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న తిప్పని యాయాతిరాజును కొత్తగూడెం త్రీ టౌన్‌కు, వీఆర్‌లో ఉన్న ఏ.రాజేష్‌ను పాల్వంచ టౌన్, కొత్తగూడెం వన్‌టౌన్‌లో ఉన్న సీహెచ్ వెంకటరెడ్డిని లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రేపటి నుంచి
‘ఉద్యాన’ తరగతులు
అశ్వారావుపేటరూరల్: కొత్తగా ఏర్పాటైన అశ్వారావుపేట ఉద్యాన కళాశాలలో ఈ నెల 26వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. ఉద్యాన పరిశోధనా స్థానం భవన సముదాయంలో కళాశాల నిర్వహణకు ఏర్పా ట్లు చేయగా, శనివారం విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ విభాగం బృందం సభ్యులు కళాశాలను సందర్శించారు. అసోసియేట్ ఇన్‌చార్జి డీన్ మజ్జిగ శ్రీనివాస్ పర్యవేక్షణలో తరగతి గదులు, బెంచీలు, డిజిటల్ బోర్డులతోపాటు ఇతర సౌకర్యాలను సిద్ధం చేశారు. కళాశాలకు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వ విద్యాలయం ఈ ఏడాది 30 సీట్లు కేటాయించగా, తొలి విడత కౌన్సెలింగ్‌లో 22 సీట్లు భర్తీ అయినట్లు డీన్ తెలిపారు. ఇప్పటివరకు 9 మంది కళాశాలలో చేరగా, ప్రైవేటు భవనాల్లో తాత్కాలికంగా హాస్టల్ వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తునట్లు పేర్కొన్నారు.


