దమ్మపేట: ఖమ్మం జిల్లా సత్తుపల్లి, వేంసూరు మండలాలకు త్వరితగతిన సాగునీరు అందించేందుకు సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని నాగుపల్లి శివారులోని సీతారామ ప్రాజెక్టు కాలువ సమీపంలో ఏర్పాటు చేసిన నిర్వాసిత రైతుల సమావేశంలో మాట్లాడారు. ఎల్నినో ప్రభావం తట్టుకోవడానికి సీతారామ కాలువల ద్వారా నీటిని ప్రవహింపజేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి నాగుపల్లి నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇప్పించామని అన్నారు. భూమి అనుభవదారులుగా ఉన్న రైతులకు పరిహారం చెల్లించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నాగుపల్లి కాలువ వయా బేతుపల్లి చెరువు ద్వారా వేంసూరు, సత్తుపల్లి మండలాలకు దీపావళిలోగా సాగునీరు అందించాలన్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ మంత్రి తుమ్మల చొరవతోనే సీతారామ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. నిర్వాసిత రైతులకు రూ. 10,24,40,266 విలువైన పరిహారపు చెక్కులను మంత్రి తమ్మల చేతులమీదుగా పంపిణీ చేశారు. అనంతరం కాలువ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరమణ, ఆర్డీఓ మధు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళి, మాజీ జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కక్కిరాల రమేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


