కొత్తగూడెంఅర్బన్: బాలల హక్కుల పరిరక్షణలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. ప్రేమలత సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మిషన్ బాల్ సురక్ష, శిక్షా, న్యాయ–2026 కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా నామినేట్ చేసిన ఉపాధ్యాయులకు శనివారం జిల్లా కోర్టులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ బాలలకు రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు, రక్షణ, సమానత్వం, గౌరవప్రదమైన జీవనం అందేలా చూడాలని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తన, వారి మానసిక స్థితి, విద్యాభ్యాసంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించాలని, బాలలపై వేధింపులు, వివక్ష, నిర్లక్ష్యం వంటివి లేకుండా చూడాలని చెప్పారు. బాలల హక్కులకు భంగం కలిగితే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్.సరిత, ఎం.రాజేందర్, అధికారులు శంభూప్రసాద్, స్వర్ణలత లేనినా, హరి కుమారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సాధిక్ పాషా, అంబేద్కర్, లలిత, కళ్యాణి, పాండురంగ విట్టల్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత


