ఆర్టీసీ ఎన్నికలపై సన్నాహక సమావేశం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎన్నికలపై సన్నాహక సమావేశం

Oct 2 2026 12:22 AM | Updated on Oct 2 2026 12:22 AM

చుంచుపల్లి: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో ఈయూ, ఎన్‌ఎంయూ, టీఎంయూ(టీ) కూటమి సన్నాహక సమావేశం గురువారం కొత్తగూడెంలోని శేషగిరి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోల్లో ఎన్నికల ప్రచారం, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారానికి కూటమిని గెలిపించాలని కోరారు. రాష్ట్ర గుర్తింపు కోసం బస్సు గుర్తుకు, ప్రాంతీయ గుర్తింపు కోసం కాగడా గుర్తుకు ఓటు వేయాలని నాయకులు పిల్లి రమేష్‌, బాలస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల నాయకులు పాటి అప్పారావు, తిమ్మినేని రామారావు, కె.భాస్కర్‌, జీ.ఎస్‌. నారాయణ, అరుణకుమారి, ఎం.రామచంద్రరావు, ఎల్‌.ఆర్‌.కే.రావు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాల

అధ్యాపకురాలికి డాక్టరేట్‌

పాల్వంచ: పాల్వంచలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆంగ్ల అధ్యాపకురాలు జాల శ్రీలక్ష్మికి డాక్టరేట్‌ లభించింది. ‘చేతన్‌ భగత్‌ రచనల్లో సాంస్కృతిక స్థాన భ్రంశం, మిశ్రమ సంస్కృతి’అంశంపై ఆమె సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్‌ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మిని గురువారం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.ఝాన్సీరాణి, వైస్‌ ప్రిన్సిపాల్‌ యు.జ్వలిత, అధ్యాపకులు జె.పద్మలత అభినందించారు.

బాహ్య మూల్యాంకనం నిర్ణయం సరికాదు

పాల్వంచ: ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఏ–1 పరీక్షల జవాబుపత్రాలను ఇతర పాఠశాలల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.రవి, వై.సంగమేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవి, సంగమేశ్వరరావు మాట్లాడుతూ సీసీఈ విధానానికి విరుద్ధంగా అమలుచేసే నిర్ణయంతో ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు.

రేక్‌ పాయింట్‌కు యూరియా

చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌ పాయింట్‌కు కోరమాండల్‌ కంపెనీకి చెందిన 2,672.19 మెట్రిక్‌ టన్నుల యూరియా గురువారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,272.19 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 500 మెట్రిక్‌ టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 800 మె.టన్నులు కేటాయించారు. మరో 100 మె.టన్నుల యూరియా బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేసినట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్ల య్య వెల్లడించారు.

ఈనెల 4న

తైక్వాండో పోటీలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా స్కూల్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యాన ఉమ్మడి జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి బి.బావ్‌సింగ్‌, తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎల్‌.రమేష్‌కుమార్‌ తెలిపారు. కొత్తగూడెం సీఈఆర్‌ క్లబ్‌లో ఈనెల 4న ఉదయం 8గంటలకు అండర్‌ 14, 17, 19 బాలురు, బాలికల విభాగాలలో పోటీలు మొదలవుతాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని, వివరాలకు 70322 96297 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

అనధికార దత్తతపై ఫిర్యాదు

ఇల్లెందురూరల్‌: మండలంలోని మామిడిగుండాల జీపీ పరిధి సువర్ణాపురంలో అనధికారికంగా జరిగిన దత్తతపై ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ కొమురమ్మ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన మహిళ ఈనెల 14వ తేదీన మూడో సంతానంగా మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆతర్వాత బాబును చాపలవారి గుంపు గ్రామానికి చెందిన మరో మహిళకు దత్తత ఇచ్చింది. అనధికారికంగా జరిగిన ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని సూపర్‌వైజర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement