● కేటీపీఎస్ కాంప్లెక్స్ ఉద్యోగుల్లో ఆవేదన ● 176 మందిలో 14 మందికే విడుదల
పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధి ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ మంజూరులో తీవ్ర అసమానతలు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన డిపార్ట్‌మెంట్ క్వార్టర్లు ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడూ కూలి పోతాయోననే ఆందోళన నెలకొంది. ఈక్రమాన వందలాది మంది ఉద్యోగులు క్వార్టర్లను అధికారులకు అప్పగించి బయటకు వెళ్లిపోయారు. చాలా మంది సొంత గృహాల్లో నివసిస్తున్నారు. అయితే క్వార్టర్లు ఖాళీ చేసిన సిబ్బందికి అందించాల్సిన హెచ్‌ఆర్‌ఏ విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న విధానం వివాదాస్పదంగా మారింది.
పైరవీ పనిచేసిందా?
కేటీపీఎస్ 7వ దశ పరిధిలోని క్వార్టర్లు వెనక్కి ఇచ్చిన మొత్తం 176 మంది ఉద్యోగుల్లో కేవలం 14 మందికి మాత్రమే హెచ్‌ఆర్‌ఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో విమర్శలు వస్తున్నాయి. అలాగే, బేసిక్ పే ప్రాతిపాదికన ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.18వేలు, రూ.19వేల చొప్పున రావాల్సి ఉండగా.. ఏరియర్స్‌తో కలిపి రూ.2లక్షల వరకు బకాయి చెల్సించాల్సి ఉందని తెలిసింది. అయితే, యూనియన్ నాయకుల పైరవీ కారణంగా కొంత మందికి మాత్రమే యాజమాన్యం హెచ్‌ఆర్‌ఏ విడుదల చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇకనైనా స్పందించి మిగతా వారికి కూడా విడుదల చేయాలనే డిమాండ్ వస్తోంది. సమస్య ఒకటే అయినప్పుడు కొందరికి ప్రయోజనం చేకూర్చి, మిగతా వారికి విస్మరించడం సరికాదని వాపోతున్నారు. నివాసాలు ఖాళీ చేసి అద్దె ఇళ్లల్లో ఇబ్బంది పడుతున్న వారితో పాటు, మిగిలిన 162 మంది ఉద్యోగులకు వెంటనే హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేయాలని కోరుతున్నారు. ఈ విషయమై సీఈ శివరామ్‌రెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.


