గణేష్ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు
నిమజ్జనానికి భద్రాచలం తరలిన గణనాథులు
● కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు ● జిల్లా కేంద్రంలో ఘనంగా శోభాయాత్ర
సూపర్‌బజార్(కొత్తగూడెం)/భద్రాచలంఅర్బన్: వీధివీధినా కొలువుదీర్చిన వినాయక విగ్రహాలు నిమజ్జనానికి బయల్దేరాయి. అంగరంగ వైభవంగా పూజలందుకున్న గణపతి ప్రతిమలు గంగ ఒడికి చేరాయి. జిల్లావ్యాప్తంగా శుక్రవారం గణనాథులను నిమజ్జనం చేశారు. ఎక్కువ మంది భక్తులు గోదావరిలో నిమజ్జనం చేసేందుకు బొజ్జ గణపయ్యను భద్రాచలం తీసుకెళ్లారు. కొందరు గ్రామ సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి శోభాయాత్ర వైభవంగా సాగింది. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూపర్‌బజార్ సెంటర్‌లో ఏర్పాటు సచేసిన స్వాగత వేదిక వద్ద ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శోభాయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత కొత్తగూడెంలోనే ఘనంగా ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలితకుమారి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు యెర్రా కామేష్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దేవీ ప్రసన్న, నాయకులు వనమా రాఘవేందర్‌రావు, నాగ సీతారాములు, కంచర్ల చంద్రశేఖర్‌రావు, మండే వీరహనుమంతరావు, ఎస్‌కే సాబీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుప్రభాత సేవ జరిపారు. అనంతరం మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. వేద పారాయణ గణపతి అనుస్థానం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ఈఓ రజినీకుమారిని భక్తులు సన్మానించారు.


