సందర్శనకు వెళ్లిన బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు
ఇరువర్గాల తోపులాట, బైఠాయించి నిరసన తెలిపిన గులాబీ శ్రేణులు
ఆందోళనలో పార్టీ పార్లమెంటరీ నేత వద్దిరాజు, మాజీ మంత్రి అజయ్
పాల్వంచ/మణుగూరు టౌన్: కేటీపీఎస్, బీటీపీఎస్ ప్లాంట్ల వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. ప్లాంట్ల సందర్శనకు వచ్చిన బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. లోపలకు అనుమతించకపోవడంతో గులాబీ నాయకులు నిరసన తెలిపారు. పోలీసులను నెట్టుకుంటూ లోపలకు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తోందని, పాలకులు పర్సంటేజీల కోసం కుంభకోణాలకు పా ల్పడుతున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. పాల్వంచలో కేటీపీఎస్ 7వ దశ సందర్శనకు వచ్చిన బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. తీవ్ర తోపులాట జరిగింది. బీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు ప్లాంట్ వద్దకు వస్తుండగా కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్‌లోనే నిలిపివేశారు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు పోలీసులను కొంతదూరం నెట్టుకుంటూ వెళ్లారు. తోపులాటలో 7వ డివిజన్ కార్పొరేటర్ సింధుతపస్వీ కింద పడగా, చేతికి గాయమైంది. రవిచంద్ర, వనమా, మెచ్చాలను మాత్రమే ప్లాంట్‌లోకి అనుమతించగా వారు చీఫ్ ఇంజనీర్ శివరామ్ రెడ్డితో సమావేశమై మాట్లాడారు. బొగ్గు నిల్వలను పరిశీలించారు. నాయకులందరినీ అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడే బైఠాయించి ధర్నా నిర్వహించారు. మీడియా ప్రతినిధులను కూడా అంబేద్కర్ సెంటర్ వద్దే నిలిపివేయడంతో వారుకూడా నిరసన తెలిపారు. బీటీపీఎస్ ప్లాంట్‌ను సందర్శించేందుకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నాయకులతో కలిసి రాగా పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురినే లోపలికి అనుమతిస్తామని అధికారులు చెప్పడంతో బీఆర్‌ఎస్ నాయకులు గేటు వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. పాల్వంచ, మణుగూరు డీఎస్పీలు సతీష్‌కుమార్, రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఆందోళన అనంతరం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విలేకరులతో మాట్లాడుతూ బొగ్గు సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడిందని ఆరోపించారు. నాణ్యత లేని బొగ్గు సరఫరా చేస్తుండటంతో విద్యుత్ ఉత్పత్తి సగానికి సగం పడిపోయిందని అన్నారు. అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నా పక్క రాష్ట్రాల బొగ్గును వినియోగిస్తున్నారని విమర్శించారు. సీతామహాలక్ష్మి, రాజు గౌడ్, పూసల విశ్వనాధం, అన్వర్ పాషా, కార్పొరేటర్లు మధుచంద్, రాంబాబు, నాయకులు మల్లెల రవిచంద్ర, వీరన్న, అనుదీప్, నవతన్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి బకాయి
తక్షణమే చెల్లించాలి
మాజీ మంత్రి పువ్వాడ అజయ్
విద్యుత్ సంస్థల నుంచి సింగరేణి బకాయి రూ. 52 వేల కోట్లను చెల్లించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. ఆందోళన సందర్భంగా ఆయన మాట్లాడుతూ థర్మల్ పవర్ ప్లాంట్‌లకు సక్రమంగా బొగ్గు సరఫరా చేయాలన్నారు రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని, బీటీపీఎస్‌లోనే రెండు యూనిట్లు పనిచేయడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కనీసం 8 గంటల విద్యుత్ కూడా అందించలేకపోతోందని విమర్శించారు. నాయకులు నాగభూషణం, రామకృష్ణ, రాంప్రసాద్, కుర్రి నాగేశ్వరరావు, సతీష్‌రెడ్డి, కోడి అమరేందర్, పోశం నర్సింహారావు, శ్రీలత, గుమ్మడి గాంధీ, దాట్ల వాసుబాబు, లక్ష్మణ్, రాంబాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


