పాల్వంచరూరల్/అశ్వారావుపేటరూరల్/చర్ల: వర్షాలకు ప్రాజెక్ట్‌ల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కిన్నెరసానిలోకి 2 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం కలిగిన జలాశయం నీటిమట్టం గురువారం 405.60అడుగులకు పెరిగింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. 13 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి ఉంచి 17,732 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎల్ 74 మీటర్లు కాగా 73.39 మీటర్ల వద్ద క్రమబద్ధీకరిస్తున్నారు. అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్ట్‌కూ వరదనీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు నుంచి భారీగా వరదనీరు బయటకు వెళ్లడంతో ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఊట్లపల్లి సమీపంలోని వెంకమ్మ చెరువు జలకళ సంతరించుకుంది. దాదాపు రెండు వేల ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందించే ఈ చెరువు గత 15 ఏళ్ల కాలంలో తొలిసారి పూర్తిగా ఎండిపోయింది. తాజాగా వరద చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


