ట్రాఫిక్ ఆంక్షలు
● ఇప్పటికే గోదావరి ఒడికి సుమారు 800 విగ్రహాలు.. ● నేడు భారీగా తరలిరానున్న గణపతి ప్రతిమలు
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరిలో వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. జోరు వర్షంలోనూ భక్తులు పలు ప్రాంతాల నుంచి గణపతి ప్రతిమలను తీసుకొస్తున్నారు. అధికారులు క్రేన్లు, లాంచీల సాయంతో నది మధ్యలో నిమజ్జనం చేస్తున్నారు. గురువారం ఒక్కరోజే 100కు పైగా విగ్రహాలను, ఇప్పటివరకు సుమారు 800 విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో నిమజ్జన ఘాట్ బురదమయంగా మారింది. దీంతో భక్తులు ఇబ్బందులు కలగకుండా పంచాయతీ సిబ్బంది ఇసుక, రాతి మొరం పోసి చదును చేశారు. శుక్రవారం 11వ రోజు కావడంతో విగ్రహాలు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్‌రాజు, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ తెలిపారు. గురువారం వారు నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రాకపోకలు, విగ్రహాల తరలింపు, ట్రాఫిక్ నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని ఆదేశించారు.
నిమజ్జన నేపథ్యంలో శుక్రవారం ట్రాఫిక్ మళ్లించనున్నారు. భద్రాచలం బ్రిడ్జి–యూబీ సెంటర్–బస్టాండ్–అంబేద్కర్ సెంటర్–కూనవరం రోడ్–డిగ్రీ కళాశాల–కరకట్ట– నిమజ్జన పాయింట్ మార్గంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనున్నారు. పాయింట్ వద్దకు వచ్చే వాహనాల్లో ఇద్దరికి మించి వ్యక్తులను అనుమతించొద్దని ఎస్పీ సూచించారు. పాయింట్ వద్ద టపాసులు కాల్చకుండా ఆంక్షలు విధించారు. భక్తులు, శోభాయాత్ర నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలని సూచించారు. డీఎస్పీ అరుణ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


