జిల్లాలో వర్షపాతం వివరాలు (మి.మీలలో)
అలుగుపోస్తున్న 180 చెరువులు, కుంటలు
16 మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే..
ఏడు మండలాల్లోనే సాధారణం..
సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచరూరల్: జిల్లాలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు వర్షాకాలం పంటల సాగుకు ప్రాణం పోశాయి. అధికారిక గణాంకాల ప్రకారం బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో సరాసరి వర్షపాతం 43.5 మి.మీగా నమోదైంది. అధికంగా అశ్వారావుపేటలో 78.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా పినపాకలో అల్పంగా 12 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు ఏడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన 16 మండలాలు ఇంకా లోటు వర్షపాతం జాబితాలోనే ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే మెరుగైన స్థితికి చేరుకున్నాయి. అశ్వాపురం, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కరకగూడెం, పినపాక, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, ఆళ్లపల్లి, గుండాల, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపాడు, భద్రాచలం, ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాలు ఇంకా లోటు వర్షపాతంలోనే ఉన్నాయి. కాగా, జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు జిల్లా సరాసరి 950.3 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా సరాసరి 726.1 మి.మీ మాత్రమే నమోదైంది. ఇంకా 23.6 శాతం లోటు ఉంది.
చెరువుల్లోకి చేరుతున్న వరద
జిల్లాలో రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. పలు చెరువులు, చెక్ డ్యామ్‌లు జలకళ సంతరించుకున్నాయి. కొత్తగూడెం ఇరిగేషన్ సర్కిల్‌లో మొత్తం 2,813 చెరువులు ఉన్నాయి. ఇందులో జిల్లాతోపాటు ములుగు జిల్లాలో కలిసిన వెంకటాపురం, వాజేడు మండలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం 180 చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. 409 చెరువులు 25 శాతం మేర నిండాయి. 530 చెరువులు 25నుంచి 50 శాతం, 869 చెరువులు 50నుంచి75 శాతం వరకు, 795 చెరువులు 75శాతం నుంచి 100 శాతం నిండాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని, ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టు, చర్ల వద్ద తాలిపేరు నిండుకుండను తలపిస్తున్నాయి. జోగారావు చెరువు, మందెరకలపాడు వద్ద రాళ్లవాగు పిక్‌డ్యామ్ అలుగుపోస్తున్నాయి. కిన్నెరసాని నదిపై సోములగూడెం, సూరారం వద్ద ఉన్న చెక్ డ్యామ్‌లు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండక ముందే పంటలు సాగు చేసిన రైతులు నీళ్లు సరిపోవని కలత చెందుతున్న తరుణంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండా వరద నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు అధిక శాతం చెరువులు, కుంటలు ప్రాజెక్టుల్లో వరద నీరుచేరి నిండాయి. పంటలకు నీళ్లు సరిపడా వచ్చాయి. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి.
–శ్రీనివాసరెడ్డి, జిల్లా జలవనరులశాఖ సీఈ
జిల్లాలో రెండు రోజులుగా జోరు వర్షం
మండలం వర్షపాతం
కరకగూడెం 26.8
పినపాక 12.0
చర్ల 30.2
దుమ్ముగూడెం 35.2
అశ్వాపురం 27.8
మణుగూరు 32.4
ఆళ్లపల్లి 34.2
గుండాల 15.8
ఇల్లెందు 48.2
టేకులపల్లి 33.8
జూలూరుపాడు 67.8
చండ్రుగొండ 58.0
మండలం వర్షపాతం
అన్నపురెడ్డిపల్లి 32.4
చుంచుపల్లి 35.0
సుజాతనగర్ 58.0
కొత్తగూడెం 48.6
లక్ష్మీదేవిపల్లి 33.2
పాల్వంచ 54.4
బూర్గంపాడు 43.2
భద్రాచలం 51.2
ములకలపల్లి 67.0
దమ్మపేట 77.0
అశ్వారావుపేట 78.4
సరాసరి 43.5


