కమనీయం రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం రామయ్య కల్యాణం

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి స్వామివారి నిత్యకల్యాణం శనివారం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న శ్రీ రామా సేవా మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

నేడు కవి సమ్మేళనం

భద్రాచలంటౌన్‌: పట్టణంలోని పాల్‌రాజు ఇంజనీరింగ్‌ కళాశాలలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఆదివారం శతాధిక కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. సమ్మేళనం పోస్టర్లను ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ శనివారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 200 మంది కవులు పాల్గొననున్న సమ్మేళనం ద్వారా తెలుగు భాష, సాహిత్యాల గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెప్పవచ్చన్నారు. శ్రీశ్రీ కళావేదిక జాతీయ అధికార ప్రతినిధి, పాల్‌రాజు ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ వరలక్ష్మి సాయిరాం, రాష్ట్ర కోఆర్డినేటర్‌ సురేష్‌బాబు తోటమల్ల, జిల్లా ప్రతినిధి ఎర్రంశెట్టి పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

రేపు జిల్లా అథ్లెటిక్స్‌

ఎంపిక పోటీలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఈనెల 21న ఉద యం 8 గంటల నుంచి కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కె మహీధర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఈ నెల 26, 27 తేదీల్లో హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. అండర్‌–14, 16, 18, 20 బాల, బాలికల విభాగాల్లో, 60, 100, 400, 600, 1000, 1500 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌ విభాగాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 21న ఉదయం 8 గంటలకు ప్రకాశం స్టేడియంలో అథ్లెటిక్స్‌ కోచ్‌ డి మల్లికార్జునరావుకు రిపోర్ట్‌ చేయాలని సూచించారు.

సులభంగా విద్యుత్‌ బిల్లుల చెల్లింపు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): విద్యుత్‌ వినియోగదారులు బిల్లులను సులభంగా చెల్లించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ లిమిటెడ్‌ (టీజీఎన్‌పీడీసీఎల్‌) డిజిటల్‌ చెల్లింపు విధానాలను అందుబాటులోకి తెచ్చిందని విద్యుత్‌ ఎస్‌ఈ గొట్టిముక్కుల మహేందర్‌ శనివారం తెలిపారు. గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం, భీమ్‌, టీజీఎన్‌పీడీసీఎల్‌ యాప్‌ల ద్వారా డిజిటల్‌ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నారని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్‌లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6,73,254 మంది, 2025–26 ఆర్థిక సంవత్సరంలో 8,27,984 మంది ఆన్‌లైన్‌ ద్వారా బిల్లులు చెల్లించారని వివరించారు.

కరకగూడెంలో మతసామరస్యం

వినాయకుడి లడ్డూను దక్కించుకున్న ముస్లిం వ్యక్తి

కరకగూడెం: కరకగూడెంలో నిర్వహించిన గణేష్‌ ఉత్సవాలు మతసామరస్యాన్ని చాటిచెప్పాయి. మండల కేంద్రంలో గణేష్‌ ఉత్సవ కమిటీ, కౌండిన్య యూత్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్వామివారి లడ్డూ వేలం పాటలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సయ్యద్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌ రూ. 3,116కు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇక్బాల్‌ హుస్సేన్‌ను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement