సూపర్‌బజార్(కొత్తగూడెం): కరువు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ అనంత రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా అధ్యక్షులు కల్తి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు చంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితిపై సర్వే నిర్వహించి పంట నష్టాలపై నివేదిక తయారు చేయాలని కోరారు. సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభ డిజైన్ ప్రకారం కాలువ పనులను పూర్తి చేసి జిల్లాలోని సాగు భూములకు నీళ్లు ఇస్తే కరువును నివారించుకునే అవకాశం ఉండేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని రైతులు కరువు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్‌కే ఉమర్, కొమరం సత్యనారాయణ, పెద్దగోని ఆదిలక్ష్మి, భూక్యహర్జ్య, కొమరం సత్యనారాయణ, కుంజ కృష్ణ, భూక్య నర్సింగ్, లక్ష్మి, రమేష్ పాల్గొన్నారు.
రీ సర్వేకు రైతులు సహకరించాలి
బూర్గంపాడు: భూముల డిజిటల్ రీ సర్వేకు రైతులు సహకరించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. పినపాక పట్టీనగర్ రెవెన్యూ పరిధిలోని అంజనాపురం గ్రామంలో జరుగుతున్న భూముల డిజిటల్ రీ సర్వేను శనివారం పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి భూముల రీ సర్వేపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల డిజిటల్ రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వేతో కచ్చితమైన సరిహద్దులు నమోదవుతాయన్నారు. సర్పంచ్ బానోతు పద్మ, ఉపసర్పంచ్ వెంకటరమణ పాల్గొన్నారు.


