గోదావరి తీరంలో ఏర్పాట్లు
పూర్తి చేయాలి
భద్రాచలం వద్ద ఘాట్ల పరిశీలనలో కలెక్టర్ అంకిత్
భద్రాచలం: భద్రాచలంలోని పవిత్ర గోదావరిలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. శనివారం గోదావరి నది తీర ప్రాంతంలో నిమజ్జన ఘాట్ల వద్ద ఏర్పాట్లను ఆయన భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పరిశీలించారు. లాంచీలు, బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీరు, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నదీ తీర ప్రాంతంలో అపశృతులకు తావులేకుండా విస్తృత భద్రతా, రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 24, 25, 26వ తేదీల్లో జరిగే నిమజ్జన వేడుకలకు పోలీస్, రెవెన్యూ, రవాణా, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, అటవీ, ఇరిగేషన్, దేవాదాయ, పంచాయతీ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. నిర్దేశించిన ప్రదేశాల్లోనే నిమజ్జనం జరిగేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. వాహనాలను నిర్దిష్ట పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు నదీ ఘాట్ ప్రాంతంలో జాగ్రత్తలు పాటించాలని భక్తులకు సూచించారు. మద్యం తాగి నిమజ్జన కార్యక్రమాలకు రాకూడదని కమిటీలకు, భక్తులకు సూచించారు. ఊరేగింపుల సమయంలో డీజేలు, అధిక శబ్దపూరిత మ్యూజిక్ వాడకూడదని, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించొద్దని చెప్పారు.
పునరుద్ధరణ పనులు సకాలంలో
పూర్తి చేయాలి
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. నాణ్యతా లోపాలు లేకుండా చూడాలన్నారు. పుష్కరాల ప్రారంభంలోపు ఘాట్ల అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, డీఎస్పీ అరుణ్ కుమార్, పంచాయతీ ఈఓ శ్రీనివాస్ రావు, దేవాలయ ఈఓ దామోదర్ రావు, ఎంవీఐ సంగం వెంకట పుల్లయ్య, ఇరిగేషన్ ఏఈఈలు రవితేజ, గణేష్, ఐటీసీ ప్రతినిధులు చెంగల్ రావు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.


