దానం తీర్పు ఎఫెక్ట్..
భద్రాచలం వైపు చూపు
● భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు అనర్హత కేసులో మరో పిటిషన్? ● ఇంప్లీడ్‌కు బీజేపీ లీగల్ సెల్ సన్నాహాలు ● దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో మరోసారి చర్చనీయాంశంగా తెల్లం కేసు
భద్రాచలం: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అనర్హత వ్యవహారం మరోసారి న్యాయస్థానం ముందుకు వచ్చింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తమ వాదనను కూడా వినిపించేలా తెల్లం వెంకట్రావును ఇంప్లీడ్ చేయాలని బీజేపీ లీగల్ సెల్ తరఫున పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వెంకట్రావు అనర్హతపై కొనసాగుతున్న కేసు
తెలంగాణ హైకోర్టులో డబ్ల్యూ.పీ. నంబర్ 8642/2026లో కూన పాండు వివేకానంద్ పిటిషనర్‌గా ఉన్నారు. ఈ పిటిషన్‌లో తెలంగాణ శాసనసభ స్పీకర్ కమ్ ట్రిబ్యునల్ ప్రధాన ప్రతివాదిగా, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రెండో ప్రతివాది గా ఉన్నారు. పదో షెడ్యూల్ కింద దాఖలైన అనర్హత పిటిషన్‌పై స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు రికార్డుల్లో ఈ కేసుకు సంబంధించి రెండో ప్రతివాదికి నోటీసు జారీ అయినట్లు తెలుస్తోంది. 2025 డిసెంబర్ 17న స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ సంబంధిత రికార్డులను కోర్టు పరిశీలించాలని, ఆ ఉత్తర్వును రద్దు చేసి అనర్హత పిటిషన్‌పై తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచిన తెల్లం వెంకట్రావు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత కోరుతూ గతంలోనే పిటిషన్లు దాఖలయ్యాయి. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో తెల్లం వెంకట్రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ ఫిరాయింపు కేసులు హైకోర్టు పరిధిలో ఉన్నాయి. వీటిలో స్పీకర్ అనర్హత పిటిషన్లపై తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు కూడా ఉన్నాయి.
అక్టోబర్ 6న కీలక విచారణ
తాజా ప్రొసీడింగ్స్ ప్రకారం ఈ నెల 16న హైకోర్టు ధర్మాసనం ముందు కేసులపై విచారణ జరిగింది. తెల్లం వెంకట్రావుకు సంబంధించిన కేసు సైతం వీటిలో ఉంది. తదుపరి విచారణ కోసం ఈ కేసులను అక్టోబర్ 6న మధ్యాహ్నం 2.15 గంటలకు లిస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునేపథ్యంలో.. ఇతరపార్టీ ఫిరాయింపు కేసులపై కూడా రాజకీయ, న్యాయవర్గాల్లో ఆసక్తి పెరిగింది. దానం నాగేందర్ కేసులో హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో అదే పదో షెడ్యూల్‌కు సంబంధించిన అంశంలో తెల్లం వెంకట్రావు కేసు తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో దానం నాగేందర్ తీర్పును ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు తెల్లం వెంకట్రావు అనర్హత అంశాన్ని ముందుకు తీసుకురావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ లీగల్ సెల్ ఇంప్లీడ్ పిటిషన్‌తో ముందుకు వస్తే.. ఇప్పటికే హైకోర్టులో ఉన్న ఈ వ్యవహారానికి మరో న్యా యపరమైన మలుపు చేరే అవకాశం ఉంది. కాగా ఇంప్లీడ్ పిటిషన్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది? ప్రధాన అనర్హత పిటిషన్‌పై ఎలాంటి ఆదేశాలు వెలువడతాయి? అన్నది అక్టోబర్ 6న జరిగే విచారణతో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


