ఆరు సార్లు సర్వే చేసినా..
హక్కు పత్రాల కోసం ఉద్యమిస్తాం
తరతరాలుగా సాగు..
ప్రభుత్వ పథకాలు రావట్లే
రెవెన్యూ, అటవీశాఖల మధ్య
నలిగిపోతున్న రైతులు
ఆరుసార్లు సంయుక్త సర్వే చేసినా ఎటూ తేలని సమస్య
వేదాంతపురం, కన్నాయిగూడెం
రెవెన్యూల్లో కన్నీటి వేదన
చర్యలు తీసుకుంటున్నాం
అర్హులకు అన్యాయం జరగదు
వీడని
చిక్కులు..
అశ్వారావుపేట మండలం వేదాంతపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 122లో ఇదే గ్రామానికి చెందిన 158 మంది గిరిజన రైతులు 427 ఎకరాల్లో 1961వ సంవత్సరం నుంచి పంటలు సాగు చేస్తున్నారు. ఇదే సర్వే నంబర్‌లో 1963 నుంచి 1991వ సంవత్సరాల మధ్య సుమారు 15 మందికి రెవెన్యూ శాఖ పట్టాలు ఇచ్చింది. మిగిలినవారికి ఇప్పటికీ భూ యాజమాన్య హక్కులు దక్కలేదు. బాధిత రైతులంతా పంటలను సాగు చేసుకుంటుండగా అటవీ శాఖ అభ్యంతరం తెలుపుతోంది. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, సరిహద్దులు తేల్చకపోవడంతో గిరిజన రైతులు నరకం అనుభవిస్తున్నారు. అర్హతలు ఉన్నా భూ హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు.
మరికొన్ని గ్రామాల్లో కూడా..
వేదాంతపురం రెవెన్యూ పరిధిలోని మరికొన్ని సర్వే నంబర్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మండలంలోని దిబ్బగూడెం(దురదపాడు) రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 76లో సుమారు 140 మంది గిరిజన రైతులకు హక్కు పత్రాలు లేవు. వీరంతా 1950, 1976వ సంవత్సరాల నుంచి పంటలను సాగు చేసుకుంటున్నారు. అటవీ, రెవెన్యూ వివాదం కారణంగా నేటికీ పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. కన్నాయిగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 152లో కూడా సుమారు వంద మంది గిరిజన రైతులకు హక్కుపత్రాలు లేవు. రామన్నగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 30, 36, 39లలో 181 మంది గిరిజన రైతులకు 573.20 కుంటల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా, భూములు మాత్రం అటవీ శాఖ ఆధీనంలో ఉన్నాయి. దీంతో గిరిజనులు సుమారు 40 ఏళ్లుగా పోరాడుతున్నారు. అశ్వారావుపేట పట్టణ సమీపంలోని సర్వే నంబరు 911లో 95 మంది రైతులు 180 ఎకరాలను తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. 2018లో ధరణి పథకంలో పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. ఎనిమిదేళ్లుగా హక్కు పత్రాల కోసం మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.
బాధిత రైతుల డిమాండ్ మేరకు తొలిసారి 1966వ సంవత్సరంలో సర్వే చేశారు. ఆ తర్వాత 1993, 2014, 2015, 2017, 2018వ సంవత్సరాల్లో రెవె న్యూ, అటవీ శాఖ సంయుక్తంగా సర్వే చేశారు. కానీ పరిష్కారం చూపలేదు. బాధిత రైతులు రోడ్డెక్కిన ప్రతీసారి ఉన్నతాధికారులు సర్వేలకు ఆదేశించడం, ఆ తర్వాత ఆయా సర్వే రిపోర్టులను బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారింది.
దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నా గిరిపుత్రులు భూమిపై హక్కులు పొందలేకపోతున్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం కొరవడి అవస్థ పడుతున్నారు. ఆందోళన చేపట్టిన ప్రతీసారి అధికారులు హామీలతో సరిపెడుతున్నారు. ఇప్పటికీ ఆరుసార్లు సర్వే నిర్వహించినా సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. దీంతో ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సాక్షిగా బాధిత రైతులు నిరసన దీక్ష చేపట్టారు. – అశ్వారావుపేటరూరల్
గిరిజన భూములకు హక్కు పత్రాల సాధన కోసం ఉద్య మం చేపడతాం. అర్హులైన గిరిజన సన్న, చిన్న కారు రైతులకు హక్కు పత్రాలు ఇచ్చేదాకా పోరా టం ఆపేది లేదు. సర్వేల పేర్లతో ఇంకెంత కాలం గిరిజన రైతులను మభ్యపెడతారు.
–సోమిని శివ ప్రసాద్, మాజీ సర్పంచ్,
నాయకపోడు సంఘం జిల్లా అధ్యక్షుడు
తరతరాలుగా భూముల్లో పంటలను సాగు చేస్తున్నాం. 1960 నుంచి మా కుటుంబం ఈ ప్రాంతంలోనే స్థిర నివాసం ఉంటోంది. రెవెన్యూ భూమిలో ఉన్నామని చెబుతున్నా అటవీ భూమి అంటూ..హక్కు పత్రాలు రాకుండా అడ్డు పడుతున్నారు. –గడ్డం పెద్ద బజారు, వేదాంతపురం
దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా భూ హక్కు పత్రాలు రావడం లేదు. హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు, రాయితీలు, బ్యాంక్ రుణాలు రావడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.
–తోట వెంకటస్వామి, బాధిత రైతు
భూ పట్టాల కోసం 60 ఏళ్లుగా పోరాడుతున్న గిరిజనులు
రెవెన్యూ, ఫారెస్టు శాఖల మధ్య కొన్ని సర్వే నంబర్లలో సమస్యలు ఉన్నాయి. సమస్య తీవ్రతను బట్టి ఒక్కొక్కటిగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. మిగిలిన వాటిలో కూడా రెండు శాఖలతో జాయింట్ సర్వేలు చేస్తాం. వివాదాలు పరిష్కరించిన తర్వాత రైతులకు హక్కు పత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటాం.
–మధు, కొత్తగూడెం ఆర్డీఓ
ఫారెస్టు, రెవెన్యూ మధ్య దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలపై దృష్టి సారించాం. సర్వే నంబర్ల వారీ జాయింట్ సర్వేలు, హద్దులు గుర్తింపు చేపడుతున్నాం. ఇప్పటికే అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని కొన్ని సర్వే నంబర్లపై స్పష్టత వచ్చింది. మిగిలిన సర్వే నంబర్లలో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తాం. భూ సమస్య చాలా సున్నితమైనవి. రైతుల జీవితాలతో ముడిపడి ఉంటాయి. తొందరపాటు లేకుండా సమస్యలను పరిష్కరించేలా ప్రయత్నిస్తున్నాం.
–కృష్ణ ప్రసాద్, ఎఫ్‌డీఓ, పాల్వంచ


