ఐదు మొక్కలు నాటాను
పుస్తకాలు అందరికీ ఉపయోగం
తల్లిదండ్రులూ ఆహ్వానిస్తున్నారు
● పుట్టిన రోజు వేడుకల్లో మొక్కలు నాటుతున్న విద్యార్థులు ● పుస్తకాలు, పాఠశాలకు ఉపయోపడే వస్తువులు కూడా బహూకరణ ● పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న జవహర్ నవోదయ విద్యార్థులు
కరకగూడెం: సాధారణంగా పుట్టినరోజు వేడుకల్లో కేక్ కట్ చేసి హడావిడి చేస్తుంటారు. అయితే కరకగూడెంలోని జవహర్ నవోదయ విద్యాలయలో సామాజిక స్పృహ, సేవాభావం అలవర్చుతున్నారు. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటించటంతోపాటు పుస్తకాలు, పాఠశాలకు ఉపయోగపడే వస్తువులను బహుమతిగా అందించాలని ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టేలా అవగాహన కల్పిస్తున్నారు. దీంతో నవోదయలోని పలువురు విద్యార్థులు లైబ్రరీకి కథల పుస్తకాలు, తరగతి గదులకు అవసరమైన గోడ గడియారాలు కానుకలుగా అందిస్తున్నారు. ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా ప్రిన్సిపాల్ సార్ ప్రో త్సాహంతో స్కూల్ ఆవరణలో ఐదు మొక్కలు నాటాను. రోజూ వాటికి నీళ్లు పోస్తుంటే ఆనందంగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా మొక్కలు నాటుతున్నారు.
–దేవిశ్రీ చరణ్, 6వ తరగతి
మా ఫ్రెండ్స్ పుట్టినరోజుకు స్కూల్ లైబ్రరీకి కథల పుస్తకాలను కానుకగా ఇచ్చారు. అవి మేమందరం చదువుతున్నాం. నా పుట్టినరోజున కూడా పాఠశాలకు ఉపయోగపడే వస్తువు ఇస్తాను.
–సాధనపల్లి శ్రీశ్రీ, 7వ తరగతి
చదువుతోపాటు పర్యావరణ పరిరక్షణ, సామాజిక స్పృహ అలవరుస్తున్నాం. చాక్లెట్లు పంచితే ఆ సంతోషం కొన్ని నిమిషాలే ఉంటుంది. ఒక మొక్క నాటితే అది పెద్దదై ఆక్సిజన్ ఇస్తుంది. ఒక పుస్తకం ఇస్తే వందల మందికి జ్ఞానాన్ని అందిస్తుంది. తల్లిదండ్రులు కూడా ఈ ఆలోచన ఆహ్వానిస్తున్నారు. బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
– రత్నయ్య, ప్రిన్సిపాల్


