ఉమ్మడి జిల్లాలో పథకం అమలు తీరుతెన్నులు
ఎనిమిదేళ్ల పథకం రెన్యువల్‌పై
నీలినీడలు
ఉమ్మడి జిల్లాలోని 3.10లక్షల మంది రైతుల్లో ఆందోళన
అప్పు తీర్చిన బీమా..
ఖమ్మంవ్యవసాయం: ఆరుగాలం కష్టపడే రైతన్నకు ఆపత్కాలంలో అండగా నిలుస్తున్న ‘రైతు బీమా’ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రీమియం గడువు ముగిసినా పునరుద్ధరణపై ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. ఎవరైనా రైతు సహజంగా లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో 2018లో అప్పటి ప్రభుత్వం ఎల్‌ఐసీ భాగస్వామ్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టగా.. మృతి చెందిన రైతు నామినీ ఖాతాలో పది రోజుల్లోగా రూ.5లక్షల పరిహారం జమ అయ్యేది. గత సంవత్సరం ఆగస్టులో ఒక్కో రైతుకు రూ.3,500 చొప్పున ప్రభుత్వం ప్రీమియం చెల్లించగా ఈనెల 13తో గడువు ముగిసింది. పది రోజులు దాటినా కొనసాగింపుపై స్పష్టత లేకపోవడంతో అయోమయం నెలకొంది. అయితే, ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పేరిట కొత్త విధానాన్ని తీసుకొచ్చే యోచనలో ఉండడంతోనే రైతు బీమాపై నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది.
3.10లక్షల మంది అర్హులు
రైతు అకాల మరణంతో కుటుంబ ఆదాయం ఒకసారిగా నిలిచిపోతుంది. పిల్లల చదువు, ఇంటి ఖర్చులు, అప్పుల భారం అన్నీ కుటుంబీకులపై పడతాయి. ఇలాంటి సమయంలో అందే రూ. 5 లక్షల పరిహారం ఊరటగా నిలిచేది. గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3.10లక్షల మంది రైతులు బీమాకు అర్హులుగా ఉన్నారు. బీమా పరిధిలోని రైతు మృతి చెందినప్పుడు అవసరమైన ధ్రువపత్రాలను వ్యవసాయ అధికారులకు అందజేస్తే పోర్టల్‌లో నమోదు చేసేవారు. పరిశీలన అనంతరం పరిహారాన్ని బీమా సంస్థ నామినీ ఖాతాలో జమ చేసేది.
12,837 కుటుంబాలకు లబ్ధి
రైతు బీమాలో చేరేందుకు కనీసం గుంట భూమి ఉన్న రైతులు కూడా అర్హులే. 18 – 59 ఏళ్ల వయసు కలిగి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, నామినీ వివరాలను వ్యవసాయ అధికారులకు సమర్పిస్తే బీమా పరిధిలోకి తీసుకొచ్చేవారు. గత ఏడాది ఆగస్టులో ఒక్కో రైతుకు జీఎస్టీతో కలిపి రూ.3,500 చొప్పున ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లించింది. పాలసీ గడువు ఈ నెల 13తో ముగిసినా పొడిగింపుపై స్పష్టత రావడం లేదు. ఉమ్మడి జిల్లాలో 2018 నుంచి 2025–26 వరకు రైతు బీమా కింద 12,837 క్లెయిమ్‌లు నమోదయ్యాయి. ఇందులో 12,683 క్లెయిమ్‌లను పరిష్కరించి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించారు. మరో 154 రైతు కుటుంబాలకు బీమా అందితే మొత్తంగా రూ.641.85 కోట్ల పరిహారం అందినట్లవుతుంది.
ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
సంవత్సరం లబ్ధి పొందిన పరిహారం లబ్ధి పొందిన పరిహారం
కుటుంబాలు (రూ.కోట్లలో) కుటుంబాలు (రూ.కోట్లలో)
2018-19 814 40.70 427 21.35
2019-20 843 42.15 488 24.40
2020-21 1,209 60.45 823 41.15
2021-22 897 44.85 719 35.95
2022-23 951 47.55 607 30.35
2023-24 978 48.90 761 38.05
2024-25 1,029 51.45 780 39.00
2025-26 872 43.60 639 31.95
మొత్తం 7,593 379.65 5,244 262.20
అన్నదాతలకు భరోసానిచ్చే
పథకానికి బ్రేక్
ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంకు చెందిన ఈ మహిళ పేరు అట్టూరి మరియమ్మ. ఈమె భర్త, వ్యవసాయం చేస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచే అట్టూరి వెంకన్న అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటికే సాగు పెట్టుబడికి చేసిన రూ.3లక్షల అప్పు ఉంది. అప్పు తీర్చడమే కాక ముగ్గురు పిల్లల పోషణపై ఆందోళనతో ఉన్న మరియమ్మకు బీమా ద్వారా రూ.5 లక్షలు అందాయి. ఈ నగదు అప్పు తీర్చడానికే కాక కటుంబ పోషణకు ఉపయోగపడింది.


