పెరుగుతున్న ప్రవేశాలు
పీఓ ప్రత్యేక శ్రద్ధతో ఐటీడీఏ పాఠశాలల్లో వర్క్‌బుక్‌లు
ఉద్దీపకం–1,2 పుస్తకాలతో మెరుగైన ఫలితాలు
ప్రాథమిక స్థాయిలో పెరుగుతున్న అభ్యసన సామర్థ్యాలు
పోటీ పరీక్షలకు సిద్ధమయేల్యా ఉద్దీపకం–3 తయారీ
భద్రాచలం: గిరిజన విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను పెంచేందుకు భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో పని చేస్తున్న పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఉద్దీపకం సత్ఫలితాలను తీసుకొచ్చింది. దీంతో ఉద్దీపకం–3ను సిద్ధం చేశారు. గిరిజన బిడ్డల విద్యాభివృద్ధికి పీఓ రాహుల్ ప్రత్యేక శ్రద్ధతో ప్రవేశపెట్టిన ఉద్దీపకం పుస్తకాలతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
నైపుణ్యం మెరుగు
పీఓ రాహుల్ బాధ్యతలు స్వీకరించాక గిరిజన సంక్షేమ పాఠాశాలల్లో పర్యటించి విద్యార్థులను ప్రశ్నలతో నైపుణ్యాలను అంచనా వేశారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు వెనుకబడినట్లు గుర్తించారు. ఇందుకోసం ఆయన మదిలో రూపొందిన ప్రణాళికే ఉద్దీపకం. గిరిజన విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణితం, ఇంగ్లిష్, తార్కిక ఆలోచన వంటి ప్రాథమిక నైపుణ్యాలను బలోపేతం చేయడం, పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షలకు అవసరమైన సాధన కల్పించి, నవోదయ, గురుకుల, కేంద్రీయ విద్యాలయ, సైనిక్ స్కూల్ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం ప్రధాన లక్ష్యంగా దీనిని రూపొందించారు. ఉద్దీపకం–1, 2 అమలుతో విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణిత సమస్యల పరిష్కారం వంటి నైపుణ్యాల్లో మెరుగుదల కనిపించింది. వర్క్‌బుక్ నిర్వహణలో సుమారు 95 శాతం మంది విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. కార్యక్రమంపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరగడంతో గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు కూడా పెరిగాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఫలితాల కొనసాగింపుగా ఉద్దీపకం–3ను మరింత విస్తృతమైన నైపుణ్యాలు, పోటీ పరీక్షల సాధన, ఓఎంఆర్ ప్రాక్టీస్‌తో రూపొందించారు.
పోటీ పరీక్షలకు ఆధునిక అంశాలతో..
గురుకులాలు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ స్కూల్ వంటి విద్యాసంస్థల ప్రవేశ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని నమూనా ప్రశ్నలను చేర్చినట్లు ఐటీడీఏ అధికారులు పేర్కొంటున్నారు. ఓఎంఆర్ విధానంపై విద్యార్థులకు ముందుగానే అవగాహన కల్పించేలా ప్రత్యేక షీట్లను రూపొందించినట్లు చెబుతున్నారు. 1, 2 తరగతులకు తెలుగు, ఇంగ్లిష్, గణితంలో ప్రాథమిక అభ్యాస నైపుణ్యాల సాధన, 3వ తరగతికి ఇంగ్లిష్, గణితంపై ప్రత్యేక వర్క్‌బుక్‌లు, 4, 5 తరగతుల విద్యార్థులకు చదివిన విషయాన్ని అర్థం చేసుకోవడం, రాయడం, మాట్లాడటం వంటి భాషా నైపుణ్యాలపై వర్క్‌బుక్‌లతో దృష్టి సారించారు.
గిరిజన విద్యార్థులను పోటీ ప్రపంచానికి దీటుగా తీర్చిదిద్దాలన్న ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆలోచనకు ‘ఉద్దీపకం’ రూపంలో సాకారం దిశగా సాగుతోంది. పాఠ్యపుస్తకాలకు అదనంగా ప్రత్యేక సాధన పుస్తకాల ద్వారా విద్యార్థుల్లో చదవడం, రాయడం, గణితం, ఇంగ్లిష్, తార్కిక ఆలోచన వంటి నైపుణ్యాలను పెంపొందిస్తోంది. గిరిజన పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంపు దీనిని రుజువు చేస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఉద్దీపకం–3 వర్క్‌బుక్‌ను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు.


