నియోజకవర్గాల వారీగా నోటీసులిచ్చే ఓటర్ల వివరాలు
తుది ఓటర్ల జాబితాలపై ప్రత్యేక దృష్టి
వివరాల పరిశీలన అనంతరం చర్యలు
డిజిటలైజ్ కాని వారికి నోటీసులు
చుంచుపల్లి: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో మూడో ఘట్టానికి అధికారులు సిద్ధమై నేడు(సోమవారం) నుంచి నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభంకానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 25 నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లకు అందించి ఆగస్టు 10 వరకు తిరిగి వాటిని స్వీకరించి డిజిటలైజేషన్ చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో అందుబాటులో లేనివారు, మ్యాపింగ్ కానీవారు, రెండేసి ఓట్లు ఉన్నవారు ఎక్కువగానే ఉన్నారు. ఈనేపథ్యాన కలెక్టర్ అంకిత్ ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి పునఃపరిశీలన చేయాలని అధికారులను ఆదేశించగా.. అందుబాటులో ఉన్నవారి వివరాలను డిజిటలైజ్ చేశారు. మ్యాపింగ్ కాని ఓటర్లకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సోమవారం నుంచి నోటీసులు ఇవ్వనున్నారు.
1,80,809 మందికి నోటీసులు..
జిల్లాలో డిజిటలైజ్ కాని వారు 1,80,809 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించగా.. ఇందులో ఓటరు జాబితాల్లో పేర్లు, ఇంటి పేర్ల తప్పులు, అక్షరదోషాలు, కుటుంబసభ్యుల మధ్య వయసుల తేడా, 2002 ఓటరు జాబితాలో మ్యాపింగ్ కాని వారిని గుర్తించి అనామలిస్ జాబితాలో చేర్చారు. వీరంతా నిర్ధేశిత పత్రాల్లో ఏదో ఒక ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అధికారులు వీరందరికీ నెల పాటు నోటీసులు ఇవ్వనుండగా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఓటు తుది జాబితాలో వారి ఓటు ఉండదని చెబుతున్నారు.
అప్రమత్తంగా రాజకీయ పార్టీలు..
అటు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ప్రక్రియను నిశితంగా గమనిస్తున్నారు. జాబితాలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా, అనర్హుల పేర్లు కొనసాగకుండా అధికారులు నిష్పక్షపాతంగా పరిశీలన చేపట్టాలని ఆయా వర్గాలు కోరుతున్నాయి. ఈనేపథ్యాన సోమవారం జిల్లాలోని 1,104 పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటరు జాబితాలను ప్రచురించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నిర్ణీత గడువులోగా స్పందిస్తేనే..
నోటీసులు అందుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా నోటీసులో పేర్కొన్న తేదీ, సమయానికి సంబంధించిన ఆధారాలతో అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. అనామలిస్ జాబితాలోని ఓటర్లు 13 రకాల ధ్రువీకరణ పత్రాల్లో అవసరమైన దాన్ని జోడించి సెప్టెంబర్ 16లోగా ఈఆర్వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్)కు సమర్పిస్తే.. వాటిని పరిశీలించి అర్హులని నిర్ధారించుకున్న తర్వాత అక్టోబర్ 19న తుది జాబితాను విడుదల చేస్తారు. దీంతో రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నియోజకవర్గం డిజిటలైజేషన్ అనామలిస్ ఓటర్లు
పినపాక 1,74,821 39,775
ఇల్లెందు 1,94,863 37,963
కొత్తగూడెం 2,15,662 46,791
అశ్వారావుపేట 1,44,771 29,051
భద్రాచలం 1,33,287 27,229
మొత్తం 8,63,404 1,80,809
నేడు ముసాయిదా జాబితా విడుదల


