రెండు రోజుల క్రితం రోడ్డు పక్కన
కలప దుంగలు ప్రత్యక్షం
సుమారు రూ. లక్షకు పైగా విలువైన
33 దుంగలు లభ్యం
సిబ్బందితో మాట్లాడాక..
దమ్మపేట: అటవీశాఖ అధికారుల తీరుపై కంచే చేను మేసిన చందంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు పాత కేసు వివరాలు అడిగితే, రికవరీ చూపేందుకు మళ్లీ కలప దుంగలు నరికించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిధిలోని కొండరెడ్ల గ్రామం పూసుకుంట గ్రామ పంచాయతీ వీరారెడ్డి గుంపులో రోడ్డు పక్కనే రెండు రోజుల క్రితం అటవీ చెట్ల దుంగలు పడి ఉండటం వెలుగుచూసింది. వాటిని పరిశీలిస్తే ఇటీవల నరికిన పచ్చి దుంగల మాదిరిగా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఏడాది క్రితం దుంగలు అయితే చెదలు పట్టి పాడై పోయేవని పేర్కొంటున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేసిన వ్యక్తి పూసుకుంట అటవీ నుంచి దుంగులను తెప్పించి పాత కేసుకు సంబంధించిన నంబర్లను రాయించారని తెలుస్తోంది. దుంగలపై 12 నుంచి 60 వరకు నంబర్లు రాసి ఉండగా, మొత్తం 33 మారుజాతి కలప దుంగలు ఉన్నాయి. వీటి విలువ రూ. లక్షకు మించే ఉండవచ్చని అంచనా.
పాత కేసులో ఏం జరిగిందంటే?
2025 ఆగస్టులో అటవీ ప్రాంతంలో చెట్లను తొలగిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది జేసీబీ యంత్రాన్ని సీజ్ చేసి దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి, రూ. లక్ష జరిమానా విధించినట్టు సమాచారం. అక్కడ పట్టుకున్న కలప దుంగలను పాల్వంచ టింబర్ డిపోకు తరలింంచాల్సి ఉండగా, తరలించలేదు. ఇటీవల ఆ కేసు గురించి ఉన్నతాధికారులు ప్రశ్నించడంతో హడావిడిగా అదే ప్రాంతంలో చెట్లను నరికించి, దుంగలకు గత కేసుకు సంబంధించిన నంబర్లను రాయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల నరికినట్టుగా పచ్చిదనం కనిపిస్తున్న దృశ్యం
పూసుకుంట అటవీ పరిధిలోని వీరారెడ్డి గుంపులో రోడ్డు పక్కనే ఉన్న అటవీ కలప దుంగలకు సంబంధించిన పూర్తి వివరాలను సిబ్బందితో మాట్లాడాక వెల్లడిస్తాం.
–శ్రీనివాస్, దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి


