వాహనాల ఫిట్‌నెస్‌.. ఆటోమేటిక్‌! | - | Sakshi
Sakshi News home page

వాహనాల ఫిట్‌నెస్‌.. ఆటోమేటిక్‌!

Aug 11 2026 12:24 AM | Updated on Aug 11 2026 12:24 AM

త్వరలోనే ఏటీఎస్‌ యంత్రం

మానవ ప్రమేయం లేకుండానే పరీక్షలు

ఏటీఎస్‌కు రాష్ట్రంలోని 15 జిల్లాలు ఎంపిక

ఆ జాబితాలో ఖమ్మం ఆర్‌టీఏకు చోటు

మ్యానువల్‌ పరీక్షలు ఉండవు...

ఖమ్మంక్రైం: సరుకు, ప్రజా రవాణా చేసే లారీలు, బస్సులు, లైట్‌ మోటార్‌ వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు ఇన్నాళ్లు అధికారులే ప్రత్యక్షం(మ్యాన్‌వల్‌)గా చేపడుతుండగా, ఈ విధానానికి చెల్లుచీటి పాడనున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఆసరాగా ఫిట్‌నెస్‌ పరీక్షించేందుకు యంత్రాలను వినియోగించనున్నారు. ఈమేరకు తొలిదశగా రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్లు(ఏటీఎస్‌)లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింధి. ఇందులో ఖమ్మం జిల్లా రవాణాశాఖా కార్యాలయానికి కూడా చోటు దక్కడం విశేషం.

మొదటి దశలోనే ఖమ్మంలో...

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 37 ప్రాంతాల్లో ఏటీఎస్‌(ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌)లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో తొలుత 15 ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేయనుండగా ఇందుకోసం రూ.50కోట్లు కేటాయించారు. ఈ జాబితాలో ఖమ్మం కూడా ఉండడంతో ఇక్కడి రవాణా శాఖ కార్యాలయంలో రూ.3కోట్ల విలువైన ఆటోమెటిక్‌ స్టేషన్‌ను ఏర్పాచేస్తారు.

ఫిట్‌నెస్‌ పరీక్షలు ఇలా...

ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌లో ప్రత్యేక పరికరాలు ఉంటాయి. వీటి పరిధిలోకి వాహనం వెళ్లగానే వాహనాల బ్రేక్‌, ఇంజన్‌ సామర్థాలే కాక కాలుష్య ఉద్గారాలు, ఇతర అంశాలను సెన్సార్లతో పరీక్ష పూర్తవుతుంది. ఆపై అంతా సక్రమంగా ఉంటేనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ అవుతుంది. అలా సర్టిఫికెట్‌ ఉన్న వాహనం వివరాలు నేరుగా కేంద్ర రవాణాశాఖ పరిధిలోని వాహన్‌ పోర్టల్‌లో ఆప్‌లోడ్‌ అవుతాయి. తద్వారా అవినీతికి ఆస్కారం లేకపోగా, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పెరిగి రోడ్డు భద్రత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

త్వరలోనే జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏటీఎస్‌ యంత్రం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రవాణాశాఖా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. యంత్రం నిర్వహణ, పరీక్షలపై రవాణా శాఖ ఉద్యోగులకు శిక్షణ ఉంటుంది.

– శ్రీనివాస్‌, ఇన్‌చార్జ్‌ ఆర్‌టీఓ

ప్రసుత్తం ఫిట్‌నెస్‌ పరీక్షలు ఎంవీఐల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే వాహనాలను పరీక్షించి ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నారు. అయితే, పలు సందర్భాల్లో వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు ఫిట్‌నెస్‌ లేనట్టు తేలుతోంది. దీంతో కార్యాలయాల్లో ఫిట్‌నెస్‌ పరీక్ష సరిగా నిర్వహించకుండానే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో నగదు చేతులు మారుతున్నట్లు తెలుస్తుండగా, కొన్ని వాహనాలు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకుండానే తిరుగుతున్నా అధికారులు నియంత్రించలేకపోతున్నారని తెలుస్తోంది. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని మానవ ప్రమేయం లేకుండా సాంకేతిక పరిజ్ఞానంతోనే వాహనాల సామర్ధ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement