ఉక్కు మహిళలుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

ఉక్కు మహిళలుగా ఎదగాలి

Aug 10 2026 12:28 AM | Updated on Aug 10 2026 12:28 AM

కొమురం భీం, సమ్మక్క, సారలమ్మలను స్ఫూర్తిగా తీసుకోవాలి

రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి

ధనసరి సీతక్క

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

దమ్మపేట/అశ్వారావుపేటరూరల్‌: ఇందిరాగాంధీ ఐరన్‌ లేడీగా నిలిచిన తీరును ఆదర్శంగా తీసుకుని, ప్రతీ మహిళ ఉక్కు మహిళగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, కలెక్టర్‌ అంకిత్‌, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో పర్యటించారు. దమ్మపేట మండలంలోని పాత చీపురుగూడెంలో రూ.10 లక్షలతో నిర్మించిన స్వయం శక్తి గ్రామ మహిళా సంఘ భవనాన్ని, ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నాచారంలో రూ. కోటి అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నాగుపల్లి పంచాయతీ కొత్తూరులో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. గర్భిణుల సీమంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. పాతచీపురుగూడెం గ్రామంలో సభ నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేటలోని రింగ్‌రోడ్‌ సెంటర్‌లో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. తొలుత కొమ్ము నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ప్రదర్శన నిర్వహించి, ఆదివాసీ జెండాను ఎగుర వేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద ఆదివాసీలకు కేటాయించిన స్థలానికి రూ.25 లక్షల వ్యయంతో మంజూరైన ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల గ్రామ పంచాయతీల పరిధిలో మహిళ సంఘ భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు. కాకతీయుల పాలనకు వ్యతిరేకంగా సమ్మక్క, సారలమ్మ, బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు, నిజాం పాలనకు వ్యతిరేకంగా కొమురం భీం చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ మహిళా సంఘాలకు భవనాలు, వడ్డీ లేని రుణాలు, మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసి, స్థిర ఆదాయ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ జిల్లాలో నిర్మిస్తున్న 357 ఇందిరమ్మ మహిళా శక్తి భవనాల్లో 80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటుకు స్థల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ విద్యాచందన జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత, పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, సర్పంచ్‌లు, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement