సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని బోనాల పండుగ సెలవు సందర్భంగా రద్దు చేసినట్లు కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోనాల పండుగ ప్రభుత్వ సెలవు ఉన్నందున జిల్లా అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. ప్రజలు సమస్యల దరఖాస్తులను అందజేసేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
గిరిజన దర్బార్ కూడా..
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన గిరిజన దర్బార్‌ను బోనాల పండుగ సెలవు నేపథ్యంలో రద్దు చేసినట్లు పీఓ బి.రాహుల్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. సెలవు కారణంగా ఐటీడీఏ యూనిట్ అధికారులు అందుబాటులో ఉండరని, గిరిజనులు వినతులు అందించేందుకు ఐటీడీఏ కార్యాలయానికి రావొద్దని సూచించారు.
వరుణ యాగానికి
భద్రగిరి వేదపండితులు
భద్రాచలంటౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో సోమవారం నిర్వహించనున్న వరుణ యాగం కార్యక్రమానికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన ముఖ్య వైదిక సిబ్బంది, వేదపండితుల బృందం ఆదివారం ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలన్నీ నిండాలని, తద్వారా పాడిపంటలు వర్ధిల్లి రైతాంగం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం ఈ మహా యాగాన్ని తలపెట్టింది. హోమాలు, పూజా కార్యక్రమాల్లో భద్రాద్రి రామాలయ అర్చక స్వాములు కీలక పాత్ర పోషించనున్నారు. వేద పారాయణం నిర్వహించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, ఉప ప్రధాన అర్చకులతో కూడిన వేదపండితుల బృందం తరలివెళ్లింది.
కిన్నెరసానిలో పర్యాటక ఆదాయం రూ.76,070
పాల్వంచరూరల్: కిన్నెరసానికి రోజురోజుకూ పర్యాటకులు పెరుగుతున్నారు. ఆదివారం అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో ప్రభుత్వానికి రూ.76,070 ఆదాయం సమకూరింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్, జలాశయం తదితరాలను వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 773 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా రూ.34,850, సఫారీ వాహనాల ద్వారా రూ. 14,450 ఆదాయం లభించినట్లు వైల్ల్‌లైఫ్ సిబ్బంది తెలిపారు. 430 మంది బోటింగ్ చేయగా టూరిజం శాఖకు రూ.26,770 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
పీజీలో నాలుగు కొత్త కోర్సులు
రేక్ పాయింట్‌కు చేరిన కాంప్లెక్స్ ఎరువులు
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆదివారం కాంప్లెక్స్ ఎరువులు చేరాయి. ఇందులో డీఏపీ 394.800 మెట్రిక్ టన్నులు, 20.20.0.13 ఎరువులు 723.250 మె.టన్నులతో పాటు ఎంఓపీ 255.200 మె. టన్నులు ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖా ధికారి డి.పుల్లయ్య వెల్లడించారు. ఈ ఎరువులను మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరఫరా చేసినట్లు తెలిపారు.


