భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్టతో కలసి దేవస్థానంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. నిర్మాణాల రూపక ల్పనలో ఆలయ ప్రాచీనతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉత్తర ద్వార నిర్మాణ పనులను ముక్కోటి ఏకాదశి లోగా, పునరుద్ధరణ పనులు గోదావరి పుష్కరాలలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆలయం నుంచి గోదావరి ఘాట్ వరకు కాలినడకన వెళ్తూ పరిశీలించారు. రోడ్డు విస్తరణ, డ్రెయినేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యంపై పలు సూచనలు చేశారు. పనుల పర్యవేక్షణకు ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి ప్రత్యేకంగా అధికారిని నియమించినట్లు వెల్లడించారు. అనంతరం అంతరాలయంలోని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ అభివృద్ధి మ్యాప్‌ను పరిశీలించారు. అధికారులు శ్రావణ్‌కుమార్, రవికుమార్, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అంకిత్ మంగళవారం తనిఖీ చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లను పరిశీలించి సంతకం చేశారు. ఈ కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


