నేటి నుంచి జేఎంఈటీల దీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జేఎంఈటీల దీక్షలు

Aug 5 2026 12:18 AM | Updated on Aug 5 2026 12:18 AM

రుద్రంపూర్‌: ఓవర్‌మెన్‌ ప్రమోషన్‌ కోసం వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న జేఎంఈటీలు ఈ నెల 5,6,7 తేదీల్లో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట దీక్షలు చేపట్టనున్నారు. 2016–17 బ్యాచ్‌కు చెందిన వీరు సంస్థలో షార్ట్‌పైరర్‌, మైనింగ్‌ సర్దార్‌, సీనియర్‌ మైనింగ్‌ సర్దార్లుగా పనిచేస్తున్నారు. గతంలో పలుమార్లు వినతి పత్రాలు అందజేసి, సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేసినా యాజమాన్యం స్పందించకపోవడంతో దీక్షలు చేపడుతున్నట్లు జేఎంఈటీలు తెలిపారు.

నేడు తల్లిపాల బ్యాంక్‌ ప్రారంభం

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన తల్లిపాలను భద్రపరిచే బ్యాంకు (హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంక్‌)ను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్‌ తెల్లం వెంకట్రావు ప్రారంభించనున్నారు. ఆస్పత్రిలో ప్రతీ నెల 200 నుంచి 300 వరకు ప్రసవాలు జరుగుతుండగా, తల్లి లేదా శిశువు ఆరోగ్య పరిస్థితుల కారణంగా వెంటనే పాలివ్వలేని సందర్భాల్లో తల్లి నుంచి ప్రత్యేక పరికరాల ద్వారా పాలను సేకరించి భద్రపరిచి తిరిగి అదే శిశువుకు అందించనున్నారు. ముర్రుపాలను కూడా ప్రత్యేకంగా నిల్వ చేసే ఏర్పాట్లు చేశారు. ఒకేసారి పది మంది బాలింతల పాలను భద్రపరిచే సామర్థ్యం ఈ బ్యాంకుకు ఉండగా, నిర్వహణ కోసం నర్సింగ్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించారు. నవజాత శిశువులకు తల్లిపాలు సకాలంలో అందించేందుకు మిల్క్‌ బ్యాంక్‌ ఉపయోగపడుతుందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు.

రెండో రోజు

కిన్నెరసాని పరిశీలన

పాల్వంచరూరల్‌: కిన్నెరసాని ప్రాజెక్ట్‌ను రెండో రోజు మంగళవారం ప్రాజెక్టుల భద్రత, స్థిరత్వ, సమర్థత(సీడీఎస్‌ఈ) బృందం పరిశీలించింది. చైర్మన్‌ రామారావు, సభ్యులు వెంకటరమణ, శ్రీకాంత్‌, లక్ష్మణ్‌రావు మొండికట్ట మార్గం వైపు కరకట్టను పరిశీలించారు. లీకులపై ఆరా తీశారు. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కేటీపీఎస్‌ 5వ దశ ఈఈ వెంకటేశ్వరరావు, ఏడీఈ రామకృష్ణ, ఏఈ సురేష్‌ ఉన్నారు.

‘సురక్ష కా తిరంగా’ పోస్టర్లు ఆవిష్కరణ

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో సురక్ష కా తిరంగా – సైబర్‌ స్వతంత్ర, తెలంగాణ సైబర్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఎస్పీ రోహిత్‌రాజు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 5 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు జితేందర్‌, శ్రీనివాస్‌, ఆర్‌ఐ కృష్ణారావు, ఎస్సై జుబేదా బేగం, పాల్గొన్నారు.

మండలాల్లోనూ ప్రజావాణి

మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

భద్రాచలంఅర్బన్‌: మండలస్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం జీఓ ఎంఎస్‌ నంబర్‌4ను విడుదల చేసింది. ఇక నుంచి ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఎంపీడీఓతో పాటు తహసీల్దార్‌, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. భద్రాచలం ప్రాంతంలో ఇప్పటికే ఐటీడీఏ పీవో, సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజా జీవోతో మండల స్థాయిలోని ఎంపీడీఓ కార్యాలయం కూడా ప్రజావాణి వేదికగా మారనుంది. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్నచిన్న సమస్యల కోసం డివిజన్‌ లేదా జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.అధికారులు ఒకే వేదిక పై అందుబాటులో ఉండటంతో ఫిర్యాదుల పరిష్కారం వేగవంతంకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement