భవిష్యత్‌కు భరోసా | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌కు భరోసా

Aug 5 2026 12:18 AM | Updated on Aug 5 2026 12:18 AM

సమష్టి కృషి ఫలితమే

సింగరేణికి పీకేఓసీ–2 డిప్‌ సైడ్‌ కేటాయింపుపై హర్షం

ఆరు వేల మంది కార్మికులు, పరోక్షంగా మరికొందరికి ఉపాధి

మరో 25 ఏళ్లపాటు నిరంతరాయంగా బొగ్గు ఉత్పత్తికి అవకాశం

మణుగూరు టౌన్‌: మణుగూరులోని పీకేఓసీ–2డిప్‌ సైడ్‌ బ్లాక్‌ సింగరేణికి దక్కడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మణుగూరు ఏరియా మనుగడకు మరో 25 ఏళ్లు భరోసా లభించింది. మణుగూరు ఏరియాలో కొండాపురం భూగర్భగని, మూడు ఓపెన్‌కాస్ట్‌లు ఉన్నాయి. వాటి నుంచి ఏటా 10 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది.

సింగరేణితో ముడిపడిన భవిష్యత్‌

విస్తరణ నేపథ్యంలో మణుగూరు ఓసీలో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోయిది. పీకేఓసీలోని ఓసీ–2, ఓసీ–4ల్లోనే వార్షికంగా 9 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఇంకా 55 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, మరో ఐదేళ్ల వరకు వెలికితీసే అవకాశం ఉంది. మరో రెండేళ్లలో మణుగూరు ఓసీలో ఉత్పత్తి ప్రారంభమైనా ఏటా రెండు మిలియన్‌ టన్నులే వస్తుంది. ఈ నేపథ్యంలో మణుగూరు మనుగడకు పీకేఓసీ–2డిప్‌ సైడ్‌ బ్లాక్‌ కీలకంగా మారింది. ఇక్కడ పనిచేసే సుమారు 2,300 మంది పర్మనెంట్‌, 3,600 మంది కాంట్రాక్ట్‌ కార్మికులతోపాటు పరోక్షంగా ఆధార పడే కుటుంబాల భవి ష్యత్‌ సింగరేణితో ముడిపడి ఉంది. ఈ క్రమంలోనే బొగ్గు బ్లాకులకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేలం వేయడంతో సింగరేణి పాల్గొని దక్కించుకుంది.

2050 వరకు ఢోకా లేదు

ప్రస్తుతం ఉన్న ఓసీలను కొనసాగిస్తే మరో ఐదేళ్ల తర్వాత మణుగూరు ఓసీ, కేపీయూజీల నుంచి వచ్చే బొగ్గు కేవలం ఏడాదికి మూడు మిలియన్‌ టన్నులకే ఏరియా పరిమితంకానుంది. పీకేఓసీ–2 బ్లాక్‌ సింగరేణి సిగలో చేరడంతో భవిష్యత్‌కు భరోసా లభించింది. బ్లాక్‌లో 110 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారికంగా చెబుతుండగా, 180 మిలియన్‌ టన్నుల వరకు ఉండొచ్చని అధికారవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక్కడ లభ్యమయ్యే జీ–8 గ్రేడ్‌ బొగ్గుకు బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. ఏటా 60 లక్షల టన్నులు వెలికితీసినా సుమారు 25 ఏళ్లపాటు కార్మిక కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుంది.

పీకేఓసీ–2 డిప్‌ సైడ్‌ బ్లాక్‌ సింగరేణికే లభించడం శుభపరిణామం. సమష్టి కృషితోనే సాధ్యమైంది. మణుగూరు మనుగడ కోసం సింగరేణికే రావాలని కార్మికులు, పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు బలంగా డిమాండ్‌ చేశారు. సింగరేణిపై ఆధారపడి ఎంతో మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం కొనసాగిస్తున్నారు.

–దుర్గం రాంచందర్‌, మణుగూరు ఏరియా జీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement