వర్షాకాలంలో ప్రబలుతున్న సీజనల్ జ్వరాలు
పీహెచ్‌సీల్లో ఖాళీగా వైద్యాధికారుల పోస్టులు
గ్రామాల్లో దోమల మందు స్ప్రే చేయించని వైనం
నిర్లక్ష్యం వీడని వైద్యారోగ్యశాఖ అధికారులు
అశ్వారావుపేట సబ్ యూనిట్ పరిధి పీహెచ్‌సీల్లో కేసులను పరిశీలిస్తే..
అశ్వారావుపేటరూరల్: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో ప్రభుత్వ వైద్య ఆరోగ్య సేవలు కుంటుపడుతున్నాయి. ఈసారి వానాకాలంలో మలేరియా, డెంగీ వంటి విష జ్వరాలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు కూడా చేపట్టలేదు. దీనికితోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. కొన్ని రకాల మందులు కూడా అందుబాటులో లేవు. సబ్ సెంటర్ల పరిధిలో ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉండటంతో వ్యాక్సినేషన్ సక్రమంగా సాగడంలేదు. జిల్లా వ్యాప్తంగా 63 మంది వైద్యాధికారుల పోస్టులు ఉండగా, ప్రస్తుతం 24 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మరో 39 వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆయుష్మాన్, యునాని వైద్యులకు
ఇన్‌చార్జి బాధ్యతలెలా..?
మెడికల్ ఆఫీసర్ల స్థానంలో పలుచోట్ల తాత్కాలికం పేరుతో ఆయుష్మాన్, యునాని వైద్యులకు ఇన్‌చార్జి బాధ్యతలు కేటాయించారు. పీహెచ్‌సీల్లో ఆయుష్మాన్, యునాని వైద్యులతో డెంగీ, మలేరియా, విష జ్వరాలకు వైద్య సేవలు అందించడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని పలువురు పేర్కొంటున్నారు. తమది కానీ శాఖలో ఆయుష్మాన్, యునాని వైద్యులతో చికిత్స ఎలా చేస్తారని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దోమల మందు స్ప్రే
మరిచిపోయారు..
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏటా ఆయా గ్రామాల్లో వర్షాకాలం సీజన్‌కు ముందే దోమల మందు స్ప్రే చేస్తారు. పదేళ్లుగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ ఏడాది కూడా జిల్లాలో 292 గ్రామాలను ఎంపిక చేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. కానీ ఇప్పటివరకు స్ప్రే చేయలేదు. ఏటా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని కావడిగుండ్ల, కొత్త కావడిగుండ్ల, చెన్నాపురం, కన్నాయిగూడెం, కంట్లం, రేగళ్ల, గోగులపూడి, దురదపాడు, ఉడుములబండ, మొద్దులమడ, పెద్దమిద్దె, రెడ్డిగూడెం, బండారుగుంపు, సుద్దగోతులగూడెం, తోగూడెం, తిరుమలకుంట ఎస్టీ కాలనీ గ్రామాలతోపాటు భద్రాచలం, గుండాల ఏజెన్సీలోని పలు గ్రామాల్లో ఏటా మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి. దోమల మందు స్ప్రే చేయకపోవడంతో గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈ ఏడాది దోమ తెరలు కూడా పంపిణీ చేయలేదు.
మొబైల్ వైద్యానికి మంగళం
పీహెచ్‌సీల పరిధిలో మొబైల్ వైద్యుల బృందం, సిబ్బంది గిరిజన గ్రామాలకు నిత్యం వెళ్లి వైద్య శిబిరాలు నిర్వహించేవారు. మొబైల్ వైద్య బృందాల్లోని డాక్టర్లను పీహెచ్‌సీల్లో నియమించడంతో.. మొబైల్ వైద్య సేవలు కొన్ని నెలలుగా నిలిచిపోయాయి. బడ్జెట్ లేని కారణంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీకి కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ఆయుష్మాన్, యునాని వైద్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి పీహెచ్‌సీలకు తాత్కాలికంగా కేటాయించారు. దోమల మందు స్ప్రే కొద్ది రోజుల్లో ప్రారంభమవుతంది. బడ్జెట్ లేకపోవడంతో మొబైల్ వైద్య సేవలకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయి.
–డాక్టర్ రాందాస్ నాయక్,
జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్
అశ్వారావుపేట మండలాన్ని పరిశీలిస్తే వినాయకపురం పీహెచ్‌సీలో ఇద్దరు, గుమ్మడవల్లి పీహెచ్‌సీ ఇద్దరు చొప్పున వైద్యాధికారులు ఉండాలి. కానీ ఈ రెండు చోట్ల ఒక్క వైద్యాధికారి కూడా లేరు. దమ్మపేట మండలంలోని దమ్మపేట, పట్వారీగూడెం, ములకలపల్లి మండలంలోని మంగపేట పీహెచ్‌సీ, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి పీహెచ్‌సీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వినాయకపురం పీహెచ్‌సీ వైద్యాధికారిని డిప్యూటేషన్‌పై జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. మరికొందరు వైద్యులు మూడు నెలల క్రితమే పీజీ, ఉన్నత విద్య కోసం వెళ్లగా, ఆ స్థానాల్లో సర్దుబాటు చేయలేదు.
పీహెచ్‌సీ మే–2026 జూన్–2026 జూలై 27వరకు
ఓపీ జ్వరాలు ఓపీ జ్వరాలు ఓపీ జ్వరాలు
వినాయకపురం 921 117 1,169 153 1,435 264
గుమ్మడవల్లి 979 106 1,029 123 1,369 196
దమ్మపేట 1,154 79 806 85 1,024 100
పట్వారీగూడెం 921 88 964 94 1,037 136
మొత్తం 3,975 390 3,868 455 4,865 696


