చర్ల: వరద ఉధృతి పెరగడంతో మండలంలోని వీరాపురం ఇసుక ర్యాంపులో ఇసుక లోడింగ్ కోసం వచ్చిన లారీల డ్రైవర్లు, అక్కడ పని చేస్తున్న సిబ్బంది 44 మంది వరదనీటిలో చిక్కుకున్నారు. వీరాపురం సమీపంలో నది మధ్యలో ఇసుక డంపింగ్‌యార్డు ఉంది. గురువారం సాయంత్రం వచ్చిన లారీలన్నీ లోడింగ్ పాయింట్ వద్ద నిలిపి ఉంచారు. తెల్లవారుజామున మరో పక్కన ఉన్న పాయ నుంచి గోదావరి వరదనీరు వచ్చి చేరింది. దీంతో తెల్ల వారుజామున కొందరు లారీ డ్రైవర్లు ధైర్యం చేసి ఇసుక పాయలో నుంచి నడుచుకుంటూ బయటకు రాగా, మరి కొందరు అక్కడే ఉండిపోయారు. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సై, నర్సిరెడ్డి తహసీల్దార్ శ్రీనివాస్ తెప్పలపై వారి వద్దకు చేరుకుని, జేసీబీపై వారిని నది నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో సీఐ వెళ్తున్న తెప్ప ఒక్కసారిగా తిరగబడడంతో ఆయన తెప్పను నీటిలోనే విడిచిపెట్టి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
నీట మునిగిన రహదారులు
మండలంలోని కుదునూరు దేవరాపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై వరదనీరు చేరడంతో రాకపోకలను నిలిపివేశారు. ఆర్ కొత్తగూడెం నుంచి బోదనెల్లి, కొండెవాయి, పులిగుండాల మీదుగా సీతానగరం వైపు ట్రాఫిక్ మళ్లించారు. వీరాపురం, చింతకుంట, కొత్తపల్లి, దండుపేట, జీపీపల్లి తదితర గ్రామాలను వరదనీరు చుట్టుముట్టడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.


