బూర్గంపాడు/భద్రాచలంఅర్బన్/దుమ్ముగూడెం: వరద ఉధృతి నేపథ్యంలో కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎస్పీ రోహిత్ రాజు విస్తా కాంప్లెక్స్ స్లూయిస్, గోదావరి కరకట్ట, స్నాన ఘాట్లు, లోతట్టు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు. గోదావరి స్నాన ఘాట్లు, నదీ తీర ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, పర్యాటక ప్రాంతాల్లో గస్తీని మరింత ముమ్మరం చేయాలన్నారు. వరద తగ్గే వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని ఆదేశించారు. డీడీఆర్‌ఎఫ్ బృందాలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతీ పోలీసు వాహనంలో లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌తో పాటు విపత్తు నిర్వహణ పరికరాలు సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం ఎస్పీ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిసరాల్లో కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ సామగ్రి, యంత్రాలు, విద్యుత్ పరికరాలను సురక్షితంగా ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ అంకిత్ శుక్రవారం రాత్రి దుమ్ముగూడెం మండలం తూరుబాక దగ్గర ప్రధాన రహదారి పైకి వరద చేరిన ప్రాంతాన్ని సందర్శించారు.
ముంపు ప్రాంతాల్లో..
గోదావరి వరద ముంపు ప్రాంతాలను శుక్రవారం రాత్రి కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. సారపాక–రెడ్డిపాలెం మధ్య రాష్ట్రీయ రహదారిపైకి నీరు చేరుతున్న నేపథ్యంలో కలెక్టర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రోడ్డుపైకి నీరు చేరితే రాకపోకలను నిలిపివేయాలని అధికారులకు సూ చించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో తహసీలార్లు అశోక్‌కుమార్, కేఆర్‌కేవీ ప్రసా ద్, ఎంపీడీఓలు వివేక్‌రామ్,జమలారెడ్డి, భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్, సీఐలు వెంకటప్పయ్య, నాగరాజు, శ్రీనివాస్, ఎస్‌ఐలు మేడ ప్రసాద్, నాగబిక్షం తదితరులు పాల్గొన్నారు.


