సిలిండర్‌! | - | Sakshi
Sakshi News home page

సిలిండర్‌!

Mar 14 2026 7:45 AM | Updated on Mar 14 2026 7:45 AM

● కమర్షియల్‌ సిలిండర్‌ సరఫరాలో కష్టాలు ● హోటళ్లలో తగ్గిన బిర్యానీ, ఇతర వంటకాల తయారీ ● బ్లాక్‌ మార్కెట్‌లో పెరుగుతున్న సిలిండర్‌ ధరలు ● జిల్లాను తాకిన పశ్చిమాసియా యుద్ధ ప్రభావం హోటళ్లకు సరఫరా పెంచాలి ఇబ్బంది పడుతున్నాం సిలిండర్లపై నియంత్రణ పెట్టాం

ఇరాన్‌–ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం తాలూకు ప్రతికూల ప్రభావం జిల్లాలో కూడా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇదే సమయంలో గ్యాస్‌ సిలిండర్ల ధరకు బ్లాక్‌ మార్కెట్‌లో రెక్కలు వస్తున్నాయి. ఫలితంగా గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
● కమర్షియల్‌ సిలిండర్‌ సరఫరాలో కష్టాలు ● హోటళ్లలో తగ్గిన బిర్యానీ, ఇతర వంటకాల తయారీ ● బ్లాక్‌ మార్కెట్‌లో పెరుగుతున్న సిలిండర్‌ ధరలు ● జిల్లాను తాకిన పశ్చిమాసియా యుద్ధ ప్రభావం

పండుగ సీజన్‌లో హోటళ్లకు గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంపై ప్రభుత్వ అధికారులు పునరాలోచన చేయాలి. గ్యాస్‌ పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతేనే రేషన్‌ పద్ధతిలో పరిమితంగానైనా గ్యాస్‌ అందివ్వాలి.

– ఎండీ పాషా,

రెయిన్‌బో హోటల్‌ యజమాని, కొత్తగూడెం

ఇటీవల కాలంలో గ్యాస్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు కదా అని స్పేర్‌ సిలిండర్‌ను పెట్టుకోలేదు. ఉపయోగిస్తున్న సిలిండర్‌ అయిపోయింది. బుక్‌ చేసినా, సకాలంలో డెలివరీ కాలేదు. దీంతో చపాతీ సెంటర్‌ను మూసేశాం. – దేవరపల్లి అంబిక,

చపాతీ సెంటర్‌, కేజీఎఫ్‌సీ ఫుడ్‌కోర్ట్‌

గృహ అవసరాలకు సంబంధించి రాబోయే రెండు నెలలకు సరిపడా గ్యాస్‌ సిలిండర్ల నిల్వలు ఉన్నాయి. అయితే ముందు జాగ్రత్తగా ప్రైవే ట్‌ సెక్టార్‌కు కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా ఆపేశాం. ప్రభుత్వ సెక్టార్‌లో ఉండే ఆస్పత్రులు, విద్యా సంస్థలకు అనుబంధంగా ఉండే హాస్టళ్లకు కమర్షియల్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్నాం. ప్రైవేట్‌ సెక్టార్‌కు సరఫరా ఆపేశాం. – ప్రేమ్‌కుమార్‌,

జిల్లా అధికారి, పౌర సరఫరాల శాఖ

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు, గ్యాస్‌ సరఫరా సప్లై చెయిన్‌లో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేసే కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాపై జిల్లా పౌర సరఫరాల శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. కమర్షియల్‌ సిలిండర్లను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల మెస్‌లు, గురుకుల పాఠశాల అవసరాల కోసం అట్టిపెట్టింది. హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా తగ్గించింది. మరోవైపు స్ట్రీట్‌ఫుడ్‌ సెక్టార్‌లో రోడ్ల వెంబడి తోపుడు బండ్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు ఉపయోగించే గృహ అవసర సిలిండర్లపై నిఘా పెట్టింది. మార్చి 11న చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో ఒక్క కొత్తగూడెంలోనే 11 సిలిండర్లను అధికారులు సీజ్‌ చేశారు.

మెనూలో కోత

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లపై ప్రభుత్వంరేషన్‌ విధించడంతో హోటళ్ల నిర్వాహకులు తమ దగ్గరున్న స్టాక్‌ ను జాగ్రత్తగా వినియోగిస్తున్నారు. గ్యాస్‌ఎక్కువ అవ సరమయ్యే ఆహార పదార్థాలను మెనూ నుంచి తొలగిస్తున్నారు. నాన్‌ వెజ్‌ వంటకాలు, బిర్యానీల తయారీలో హోటల్‌/రెస్టారెంట్‌ యజ మానులు వెనకడుగు వేస్తున్నారు. సాధారణ అన్నం వండటానికంటే బిర్యా నీ వండేందుకు నాలుగురెట్ల వరకు గ్యాస్‌ వినియోగించాల్సి వస్తోంది. దీంతో పరిమితంగా నాన్‌ వెజ్‌, బిర్యానీ వంటివి చేస్తున్నారు. దీంతో ఈ వంటకాలు క్షణాల్లో అయిపోతున్నాయి. మరోవైపు ఎర్ర సిలిండ ర్లు వినియోగించే చపాతీసెంటర్లు, బజ్జీలకొట్లు, పానీ పూరి బండ్లు, టీ స్టాల్స్‌ నడిపే చిరు వ్యాపారులు సైతం తమ కార్యకలాపాలు తగ్గించారు. పీక్‌ అవర్స్‌లోనే గంట రెండు గంటల సేపు అమ్మకాలు సాగించి, ఆ తర్వాత తమ వ్యాపారాలను కట్టిపెడుతున్నారు.

రెక్కలు విచ్చుకున్న బ్లాక్‌ మార్కెట్‌

గ్యాస్‌ సరఫరా విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలకు బయట జరుగుతున్న ప్రచారా నికి పొంతన లేకుండా పోయింది. గ్యాస్‌ దొరకదనే వదంతులు విపరీతంగా ప్రాచుర్యంలోకి వస్తున్నా యి. ఇదే అదనుగా గ్యాస్‌ సిలిండర్లకు బ్లాక్‌ మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. గృహ అమసరాలకు ఉపయోగించే డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.952 ఉండగా ప్రస్తుతం బ్లాక్‌ మార్కెట్‌లో రెండు వేల రూపాయల వరకు పలుకుతోంది. ఇక కమర్షియల్‌ సిలిండర్‌ విషయానికి వస్తే అసలు ధర రూ.2067 ఉండగా పరిస్థితులను బట్టి రూ.3,500ల నుంచి రూ. 4,000ల వరకు చేతులు మారుతున్నాయి. గ్యాస్‌ వదంతులు జోరందుకోవడంతో పరిమితంగానే గ్యాస్‌ను విని యోగించే గృహస్తులు సైతం ముందుస్తుగా సిలిండర్లు బుక్‌ చేసుకోవడం మొదలెడుతున్నారు. మొత్తంగా పశ్చిమాసియాలో ఆకాశంలో క్షిపణులు దూసుకుపోతుంటే ఇక్కడ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు చీకటి దందాలో సర్రుమంటూ ౖపైపెకి పోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement