ఆర్టీసీ ద్వారా బుక్ చేసుకోండి
ముంగిటకే..
● దేవస్థానం, పోస్టల్, ఆర్టీసీ కార్గోల ద్వారా చేరవేత ● 3.5 లక్షల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న అధికారులు ● రామయ్య కల్యాణానికి రాలేని భక్తులకు అందజేత
భద్రాచలం: ఎంతో పవిత్రంగా భావించే ముత్యాల తలంబ్రాలు భక్తుల చెంతకే రానున్నాయి. శ్రీసీతారామ చంద్రస్వామి కల్యాణంలో వినియోగించే వీటిపై భక్తులు అమితాసక్తి చూపుతున్నారు. దీంతో దేవస్థానం ఆధ్వర్యంలో అవసరం మేర ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. ఆలయ వెబ్‌సైట్‌లో బుకింగ్ అవకాశం కల్పించగా, పోస్టల్ ఆర్టీసీ సంస్థలు కూడా తలంబ్రాల చేరవేతలో పాలుపంచుకుంటున్నాయి. మొత్తంగా భద్రగిరి ముత్యాల తలంబ్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భక్తుల వద్దకు చేరుతుండటం విశేషం.
మూడున్నర లక్షల ప్యాకెట్లకు పైగా..
తొలినాళ్లల్లో ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను చేతితో తయారు చేసేవారు. అనంతరం కాలంలో డిమాండ్ భారీగా పెరగటంతో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన రెండు యంత్రాలతో ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో మిషన్ ద్వారా రోజుకు సుమారు పది వేల ప్యాకెట్లను తయారు చేస్తారు. ఈ నెల 6వ తేదీన ప్యాకింగ్ ప్రారంభం కాగా, ఉగాది లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈసారి మూడున్నర లక్షల ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఇవి కాకుండా వీవీఐపీలు, ప్రముఖులు, వివిధ శాఖలకు అందించేందుకు మరికొన్ని ప్యాకెట్లను సిద్ధం చేస్తారు. ఇందుకోసం సుమారు25 క్వింటాళ్ల తలంబ్రాలు, పెద్ద ముత్యాలు 150 కేజీలు, చిన్న ముత్యాలు 150 కేజీలు వినియోగిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
దేవస్థానం కార్గో, పోస్టల్ శాఖల ద్వారా..
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం వద్ద కౌంటర్‌లో రూ.25కు ఒక ముత్యం కలిగిన తలంబ్రాల ప్యాకెట్‌ను విక్రయిస్తారు. దేవస్థానం వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే రూ.60కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గ్రామాలకు చేరుస్తారు. ఇతర రాష్ట్రాలకు డెలివరీ చార్జీలు అదనంగా ఉంటాయి. ఇక ఆర్టీసీ సంస్థ కార్గో ద్వారా భక్తుల ఇంటికే తలంబ్రాలను అందిస్తోంది. కార్గోకు ఆదరణ లభిస్తుండగా, రూ.150కు రెండు ప్యాకెట్లను చేరవేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే సుమారు 6 వేల ప్యాకెట్లు ఆర్టీసీ ద్వారా బుక్ చేసుకోవడం విశేషం. ఇక పోస్టల్ శాఖ సైతం ఈ సేవలను అందిస్తోంది. గతేడాది రూ.110కు ఈ సేవలను అందించగా, ఈ ఏడాది చార్జీలను ప్రకటించి విడుదల చేయాల్సి ఉంది.
ఆర్టీసీ కార్గో ద్వారా ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటి ముంగిటకు ఇవ్వటం 2023లో ప్రారంభించాం.తొలి ఏడాది కేవ లం 23 వేల ప్యాకెట్లను అందించాం. అనంతరం కాలంలో లక్షకు చేరింది. ఈ ఏడాది ఇప్పటికే బుకింగ్ ప్రారంభించాం. ఆర్టీసీ వెబ్‌సైట్‌లో సైతం బుక్ చేసుకోవచ్చు. రూ.150కు రెండు ప్యాకెట్లను జీఎస్టీతో కలిపి ఎక్కడికై నా బుక్ చేసుకోవచ్చు.
–జంగయ్య, ఆర్టీసీ భద్రాచలం డిపో మేనేజర్


