గెలుపు మార్పునకు నాంది పలకాలి | - | Sakshi
Sakshi News home page

గెలుపు మార్పునకు నాంది పలకాలి

Mar 14 2026 7:45 AM | Updated on Mar 14 2026 7:45 AM

పాల్వంచ: ప్రజాస్వామిక పద్ధతుల్లో సాధించిన గెలుపు సమాజ మార్పునకు నాంది పలకాలని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సుగుణా గార్డెన్స్‌లో సీపీఐ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు రెండు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ శిబి రం శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు కొత్తగూడెం మేయర్‌ మూడ్‌ గణేష్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్‌పాషా అధ్యక్షతన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులకు రాజకీయ దృక్పథంతోపాటు ప్రత్యేక లక్ష్యం ఉండాలని సూచించారు. పాలన రాజ్యాంగానికి లోబడి జవాబుదారీతనంతో ఉండాలని చెప్పారు. కీలక నిర్ణయాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించా లన్నారు. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పునకు కృషిచేయాలని చెప్పారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల్లో నైతికత లోపించిందని అన్నారు. డబ్బు ప్రాధాన్యం పెరగడంతో రాజకీయాలు కలుషితమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. క్రమంగా మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని అన్నారు. సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ భారత దేశంపై యుద్ద ప్రమాదం పడిందని,గ్యాస్‌, ఇతర నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోతున్నాయని అన్నారు. దేశం మోదీ విధానాల వల్ల అబాసుపాలవుతోందని, దేశ ప్రధానిగా మోదీ వ్యవహారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందు సాగిలపడినట్లు అయిందని విమర్శించా రు. రాష్ట్రంలో పేదలు నివసిస్తున్న స్థలాలను క్రమబద్ధీకరించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పన, విద్యావైద్యం, తాగునీరు తదితర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, నాయకులు బేడవాడ వెంకటేశ్వర్లు, ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, భిక్షపతి, సూర్యదేవర రామ్మోహన్‌ రావు, సిద్దులు, పద్మ, ఉమ, వాసిరెడ్డి మురళి పాల్గొన్నారు.

సీపీఐ రాజకీయ శిక్షణ తరగతుల్లో వక్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement