భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలతో దర్శనం ఇచ్చారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూ జలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరా ట్‌కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజ లతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీ కుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.
‘ఏకలవ్య’లో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ తనిఖీలు
దమ్మపేట: ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన మండల పరిధిలోని గండుగులపల్లి ఏకలవ్య మోడ్రన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ రామోజీ రమేష్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై పాఠశాల ప్రిన్సిపాల్ సంజయ్ మలాకర్ ద్వారా ఆరా తీశారు. జిల్లా ఆహార భద్రత అధికారి శరత్, స్టోర్ రూమ్‌లోని ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి, బాధ్యులకు పలు సూచనలు చేశారు.
ఐటీసీ గేట్ వద్ద ఆందోళన
బూర్గంపాడు: సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీ మెయిన్‌గేట్ వద్ద గురువారం నాగినేనిప్రోలు గ్రామపంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆందోళన చేపట్టారు. నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో సీఎస్‌ఆర్ నిధులు చేపట్టిన డ్రెయినేజీ పనులకు గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని పిలవకుండా ఎమ్మెల్యేతో శంకుస్థాపనలు చేసి తమను అవమానించారని ఐటీసీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ సరోజ మాట్లాడుతూ ప్రొటోకాల్ పాటించకుండా విపక్ష పార్టీలో ఉన్నామనే కారణంగా ఎమ్మెల్యే కూడా పంచాయతీ పాలకవర్గాన్ని అవమానించారని ఆరోపించారు. ఐటీసీ పీఎస్‌పీడీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్) శ్యామ్‌కిరణ్ నచ్చజెప్పడంతో శాంతించి, ఆందోళన విరమించారు.


