ఇల్లెందు: మే 11, 12, 13 తేదీల్లో ఇల్లెందులో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ అనుబంధ అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలు ఇల్లెందులో నిర్వహించనున్నట్లు సంఘం జాతీయ కన్వీనర్ కెచ్చెల రంగయ్య, నాయకులు ప్రదీప్‌సింగ్ ఠాగూర్ వెల్లడించారు. రెండు రోజులుగా ఇల్లెందులో జరుగుతున్న సంఘం సమావేశాలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంఘం పనితీరును సమీక్షించుకోవడంతో పాటు లోపాలను అధిగమించేందుకు నూతన నాయకత్వాన్ని ఏర్పాటు చేసి ఉద్యమాలను బలోపేతం చేస్తామని చెప్పారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 300 మంది ప్రతీనిధులు ఈ మహాసభలకు హాజరవుతారని తెలిపారు. 11వ తేదీన ఇల్లెందులో భారీ ర్యాలీ, బహిరంగసభ ఉంటాయని వివరించారు. అభిమానులు ఆర్థిక సాయం అందించి సభల విజయవంతానికి సహకరించాలని కోరారు. ఈ మహాసభలకు ఇతర పార్టీల అనుబంధ సంఘాల ప్రతినిధులను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
అమెరికాతో ఒప్పందం భారత్‌కు నష్టం
అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం చేసుకుందని, ఇది దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని మాస్‌లైన్ జాతీయ నాయకులు ప్రదీప్‌సింగ్ ఠాగూర్ అన్నారు. అమెరికా పేద దేశాలపై అప్రజాస్వామికంగా యుద్ధం చేస్తోందని, ప్రజలను నిర్దాక్ష్యిణ్యంగా హతమారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ – అమెరికా ఒప్పందాన్ని నిరసిస్తూ ఈనెల 23న దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నాయకులు శిబిగిరి, పరితోషిదాస్, నిరంజన్ బేరా, దేవరావు, ఎస్‌కే గౌస్, బి.రాము, అరుణ, బుర్ర వెంకన్న, పాయం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


