ప్రగతి ప్రణాళిక సమర్థంగా అమలుచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రగతి ప్రణాళిక సమర్థంగా అమలుచేయాలి

Mar 5 2026 7:32 AM | Updated on Mar 5 2026 7:32 AM

● పాఠశాలలు, వసతి గృహాలను పర్యవేక్షించాలి ● అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

గురుకుల పాఠశాలలో తనిఖీ

● పాఠశాలలు, వసతి గృహాలను పర్యవేక్షించాలి ● అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 6 నుంచి జూన్‌ 12 వరకు వివిధ అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం నుంచి 15 వరకు కార్యాలయాలు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్‌ ఉంటుందన్నారు. పెండింగ్‌ ఫైళ్ల పరిష్కారం, రికార్డుల నిర్వహణ, ప్రజలకు సకాలంలో సేవలందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏప్రిల్‌ 6 నుంచి 11 వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, వైద్య పరీక్షలు, గర్భిణులు, చిన్నారులపై ప్రత్యేక పర్యవేక్షణ, పోషకాహార అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. 13 నుంచి 18 వరకు అరైవ్‌–ఎలైవ్‌ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 20 నుంచి 25 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షించనున్నట్లు చెప్పారు. 27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత, నో డ్రగ్స్‌ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఆ తర్వాత వరుసగా వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్‌ తదితర శాఖలకు సంబంధించిన సమస్యలపై కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇలా 99 రోజుల పాటు కార్యాచరణ అమలు చేస్తామన్నారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. ప్రతీరోజు నిర్వహించిన కార్యక్రమాల పూర్తి వివరాలతో ప్రగతి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా పురోగతి, సమస్యలు, తీసుకున్న చర్యలు తదితర వివరాలు సమగ్రంగా నివేదికలో పొందుపరచాలని సూచించారు. కార్యక్రమం అమలుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబూరావు, డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్‌, పౌరసరఫరాల డీఎం త్రినాథ్‌ బాబు, మిషన్‌ భగీరథ ఈఈలు తిరుమలేష్‌, నళిని, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

సుజాతనగర్‌: మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్‌ అంకిత్‌ బుధవారం తనిఖీ చేశారు. పాఠశాల వసతి, సదుపాయాలు, తరగతుల నిర్వహణ, హాజరు పట్టికతో పాటు విద్యార్థుల కోసం తయారు చేసిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. భోజనం ఎలా ఉంది.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. బాగా చదివి మంచి మార్కులు సాధించాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. వసతి గదులు, డైనింగ్‌ హాల్‌, మరుగుదొడ్ల పరిస్థితుల గురించి వార్డెన్‌ బ్యూలారాణిని ఆడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement