రామయ్య పెళ్ల్లికొడుకాయెనే! | - | Sakshi
Sakshi News home page

రామయ్య పెళ్ల్లికొడుకాయెనే!

Mar 5 2026 7:32 AM | Updated on Mar 5 2026 7:32 AM

వేడుకగా వసంతోత్సవం

పసుపు దంచి.. తలంబ్రాలు కలిపి పెళ్లి పనులు ప్రారంభం

స్వామివారికి వైభవంగా వసంతోత్సవం, డోలోత్సవం

గోటి తలంబ్రాలతో పాదయాత్రగా తరలివచ్చిన భక్తులు

రామనామ స్మరణతో మార్మోగిన మిథిలా స్టేడియం

భద్రాచలం: శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ముందుగానే వచ్చిందా అన్నట్లుగా భద్రగిరి మురిసింది. భక్తిశ్రద్ధలతో అర్చకులు, అధికారులు పసుపు, కుంకుమలు దంచగా, తలంబ్రాల తయారీలో మహిళల ఉత్సాహం.. మరో వైపున శ్రీరామనామ స్మరణలు చేస్తూ గోటి తలంబ్రాలతో పాదయాత్రగా వచ్చిన భక్తజనం.. వెరసి మిథిలా స్టేడియం కళకళలాడింది. ఆనందోత్సాహాల నడుమ రామయ్య పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. వసంతం చల్లుకున్న శ్రీ సీతారాములు దర్శనమివ్వగానే ‘మా రామయ్య పెళ్లికొడుకాయెనే’ అంటూ భక్తులు మురిసిపోయారు.

ఒకరోజు ఆలస్యంగా..

ప్రతీ ఏడాది ఫాల్గుణ పౌర్ణమి రోజున పసుపు కొమ్ములు దంచి, తలంబ్రాల తయారీతో రామయ్య పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. ఈసారి చంద్రగ్రహణం రావడంతో ఈ వేడుకలను బుధవారం ప్రారంభించారు. తొలుత మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకీ సేవగా ఉత్తర ద్వారం వద్ద ఆశీనులు చేశారు. అర్చకులు, వేదపండితులు స్వామివారికి, రోళ్లు, రోకళ్లకు సంప్రదాయ పద్ధతుల్లో పూజలు చేశారు. ఆ తర్వాత పసుపు కొమ్ములు దంచి కల్యాణ వేడుకలను ప్రారంభించారు. బియ్యంలో పసుపు, రోజ్‌వాటర్‌, గులామ్‌, సుగంధ ద్రవ్యాలు, అత్తర్‌ కలిపి తలంబ్రాలు తయారు చేశారు. వాటిని ఆలయ అధికారులు శిరస్సుపై ధరించి స్వామివారి మూలమూర్తుల పాదాల చెంతన ఉంచారు. కాగా ప్రతీ ఏడాది పాదయాత్రగా గోటి తలంబ్రాలతో వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ సంవత్సరం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మిథిలా స్టేడియ ప్రాంగణం నిండిపోయింది. తలంబ్రాల తయారీలో మహిళా భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. భద్రాచలానికి చెందిన స్నేహితుల బృందం.. గోటి తలంబ్రాలు తీసుకొచ్చిన సుమారు 8 వేల మందికి అల్పాహారం, టీ, మజ్జిగ అందించి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు.

ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతారాములకు వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు సువర్ణ లక్ష్మీ అమ్మవారికి పంచామృతంతో కలశాభిషేకం, సహస్ర ధారలతో స్నపనం జరిపారు. ఆస్థాన గాయకులు రామదాసు కీర్తనలను ఆలపిస్తుండగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి నక్షత్ర హారతి సమర్పించారు. అర్చకులు శ్రీ సీతారాములపై రంగులు చల్లి వసంతోత్సవాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భక్తులపై, ఈఓ దంపతులపై రంగులు చల్లారు. సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సర్పంచ్‌ పూనెం కృష్ణ, ఆలయ ఈఓ దామోదర్‌రావు, స్థానాచార్యులు స్థలశాయి, ట్రస్ట్‌ బోర్డ్‌ మాజీ సభ్యులు బూసిరెడ్డి అంకిరెడ్డి, అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement