భద్రాచలంటౌన్: ఐటీడీఏ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించనున్న గిరి మాల్ట్‌లో వివిధ పోస్టుల భర్తీకి ఏపీఓ డేవిడ్ రాజ్ స్థానిక వైటీసీ భవనంలో బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సేల్స్ అసోసియేట్, క్యాషియర్, స్టాక్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్, ఆపై విద్యార్హత కలిగిన యువతీ, యువకులు 15 మంది హాజరు కాగా, వ్యాపార లావాదేవీలపై నైపుణ్యాల ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. ఇంకా ఎవరైనా ఇంటర్వ్యూకు రాలేకపోయిన వారు ఉన్నా తమ కార్యాలయంలోని భవిత సెల్‌లో సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో పీవీటీజీ అధికారి గన్యా, జేడీఎం హరికృష్ణ పాల్గొన్నారు.
వెంకటరెడ్డి సేవలు
మరువలేనివి
కామేపల్లి: మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మాజీ మంత్రి 10వ వర్ధంతి సందర్భంగా బుధవారం కొత్తలింగాల క్రాస్‌లోని ఆయన విగ్రహానికి వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కనకయ్య మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడడమేకాక ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలు, పార్టీకి సేవలు చేశారని కొనియాడారు. తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన వెంకట్‌రెడ్డి ఆశయ సాధనకు కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని కోరారు. ఇల్లెందు మున్సిపల్ చైర్‌పర్సన్ కిరణ్‌మిత్ర, నాయకులు రాంరెడ్డి కృష్ణారెడ్డి, చరణ్‌రెడ్డి, మానుకొండ రాధాకిషోర్, జగన్నాథరెడ్డి, గింజల నర్సింహారెడ్డి, మేకల మల్లిబాబుయాదవ్, ధనియాకుల హన్మంతరావు, తోటకూరి శివయ్య, నల్లమోతు లక్ష్మయ్య, గుజ్జర్లపూడి రాంబాబు, రెడబోతు గోపీరెడ్డి పాల్గొన్నారు.
సమర్థవంతంగా వినియోగించాలి
చుంచుపల్లి: 102, 108 అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ సూచించారు. జిల్లాలోని 102, 108 వాహనాల కోఆర్డినేటర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో, గర్భిణులను ప్రభుత్వాస్పత్రులకు తరలించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. డీపీఎంఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు.


