తేలని పంచాయితీ.. | - | Sakshi
Sakshi News home page

తేలని పంచాయితీ..

Mar 5 2026 7:32 AM | Updated on Mar 5 2026 7:32 AM

సీజన్‌ వచ్చేస్తోంది..

మరమ్మతులు, అప్‌గ్రేడ్‌కు సిద్ధమైన ప్రణాళిక

ఖర్చుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

రెండేళ్లుగా ముందుకు సాగని ప్రాజెక్ట్‌ పనులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రెండేళ్ల క్రితం అకస్మాత్తుగా వచ్చిన భారీ వరదలతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలవనరుగా ఉన్న అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలోని పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. నాటి నుంచి ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడం, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా అప్‌గ్రేడ్‌ చేయడంలో రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీ తెగడం లేదు. దీంతో ఆయకట్టు పరిధిలోని ఇరు రాష్ట్రాల రైతులతో పాటు జిల్లాకు చెందిన మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

16 వేల ఎకరాల ఆయకట్టు..

పెద్దవాగు ప్రాజెక్టును 1981లో నిర్మించారు. దీని కింద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగంగా ఉన్న అశ్వారావుపేట, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో 16 వేల ఎకరాలు సాగవుతుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టు తెలంగాణలో ఉండిపోగా 13వేల ఎకరాల ఆయకట్టు ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు ఏపీ పరిధిలోకి వెళ్లాయి. దీంతో ప్రాజెక్టు నిర్వహణ ఎవరు చేపట్టాలనే అంశంపై 2014 నుంచి సందిగ్ధత నెలకొంది. ఆయకట్టులో సింహభాగం ఉన్న ఏపీ సర్కారు ప్రాజెక్టు మెయింటెనెన్స్‌కు ముందుకు రాలేదు. ఇటు తెలంగాణ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. దీంతో ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

పోటెత్తిన వరద..

పెద్దవాగు ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 40 వేల క్యూసెక్కులు. ఇక్కడ నీరు నిల్వ ఉంచడం, కిందికి వదిలేందుకు వీలుగా 18 అడుగుల ఎత్తుతో మూడు గేట్లు నిర్మించారు. అయితే 2024 జూలై 17న రెండు, మూడు గంటల వ్యవధిలోనే 90వేల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పటికే ప్రాజెక్టులో 16 అడుగుల ఎత్తున నీళ్లు నిలిచి ఉన్నాయి. పై నుంచి భారీ వరద మొదలైన తర్వాత గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించగా.. నిర్వహణ లోపాల కారణంగా మూడో గేటు మొరాయించింది. వరద అంతకంతకూ పెరిగి గేట్లు, మట్టికట్ట మీదుగా నీరు ప్రవహించింది. దీంతో రైట్‌ కెనాల్‌ తూము దగ్గర రెండు వేర్వేరు చోట్ల మొత్తంగా 60 మీటర్ల మేర గండి పడింది. అంతేకాక ట్యాంక్‌బండ్‌ సైతం 150 మీటర్ల మేరకు బలహీనపడింది.

వాటాపై తేలని పంచాయితీ

ప్రాజెక్టు మరమ్మతులు, అప్‌గ్రేడ్‌ పనులకు అయ్చే ఖర్చును రెండు రాష్ట్రాలు భరించాలని ఒప్పందం చేసుకున్నారు. 2024లో వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని కట్ట ఎత్తు పెంచడంతో పాటు రెగ్యులేటరీ గేట్ల సంఖ్యను మూడు నుంచి ఐదుకు పెంచాలని నిర్ణయించారు. దీనికోసం రూ.101 కోట్ల ఖర్చు వస్తుందని ఇరు రాష్ట్రాల ఇంజనీరింగ్‌ అధికారులు గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(జీఆర్‌ఎంబీ)కు విన్నవించారు. అయితే, ఈ ప్రాజెక్టు కింద మొత్తం 16 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా ఇందులో 13 వేల ఎకరాలు ఏపీ పరిధిలో, అశ్వారావుపేట మండల పరిధిలో మూడు వేల ఎకరాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా పెద్దవాగు కోసం వెచ్చించే నిధుల్లో 85 శాతం ఏపీ భరిస్తే 15 శాతం తాము చెల్లిస్తామని తెలంగాణ అంటోంది. మరోవైపు 82, 18 శాతం నిష్పత్తిలో ఖర్చు భరించాలని ఏపీ వాదిస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన జీఆర్‌ఎంబీ సమావేశంలోనూ ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

జిల్లాలో పెద్దవాగు కింద అధికారికంగా మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంటే అనధికారికంగా మరో రెండు వేల ఎకరాల వరకు సాగవుతోంది. ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో ఇప్పటికే 2024, 2025 సీజన్‌ పంటలను రైతులు కోల్పోయారు. ప్రస్తుతం వేసవి వచ్చింది. ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఇది అనుకూలమైన సమయం. ఇరు రాష్ట్రాల మధ్య కేవలం రూ.3 కోట్ల విషయంలోనే పంచాయితీ తెగడం లేదు. కాగా, గురువారం హైదరాబాద్‌లో జీఆర్‌ఎంబీ సమావేశం జరగనుంది. కనీసం ఈ సమావేశంలోనైనా పెద్దవాగు ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావడంపై ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌ విభాగాలు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది.

వరదలతో కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement